పుట:కాశీమజిలీకథలు -01.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రత్నాంగి కథ

149

వాచితిమి. అప్పులవారు నా మగనిం బెట్టు నిర్బంధమును జూచి సహింపక యొక్కనాడు నే నతని వెంటబెట్టుకొని పుట్టిన యింటికరిగితిని. నాతండ్రి మా హీనస్థితి దెలియని వాడగుట మమ్ముమిగుల గౌరవించెను. అట్టి గౌరవముతోఁ గొన్ని దినంబు లందుండి యొక్క నాఁడు మగని నిమిత్తము బొంకి యతనితో నిట్లంటి.

నాయనా! మీ యల్లుడు మిగుల భాగ్యవంతుడను విషయము నీ వెఱింగినదియే కదా! ఆయన యిప్పుడు సముద్రవర్తకము చేయ నారంభించెను. కొన్నిదినముల క్రిందట నోడమీద రెండులక్షలు వెలగల సరకులు విదేశమున కెగుమతిచేసెను. ఆ యోడ యింకను రాలేదు, యిక్కడఁ గొన్నిసరకులు గొనవలసియున్నది. కొంత సొమ్ము బదులిచ్చినచో వడ్డీతో వెంటనే తీర్పించెదను. ఈపాటి యుపకార మల్లునికిఁ చేయవోపుదువే యని యడిగిన మాటలకు సంతసించి యతండు తల్లీ! మీరు మాత్రము నా సొత్తుదిన నర్హులుగారా? నాకు మరల నియ్యనక్కర లేదు. అవసరమున్న సొమ్ము తీసికొని పొండని యుత్తరము జెప్పెను.

ఆమాట నా మగనితో రహస్యముగాఁ జెప్పి మరల జూదమాడకుండునట్లును, నదివరకున్న ఋణముల దీర్చి మిగిలిన సొమ్ముతో యథోచితవ్యాపారములు చేయు నట్లును నతనిచే ముమ్మారు ప్రమాణికము చేయించి నాతండ్రియొద్దఁ గొంతసొమ్ము తీసికొని యతని కియ్యక నా యొద్దనే యుంచుకొని వానితో మరల నత్తవారి యూరి కరుగుచుంటిని. ఆ దుర్మార్గు డేమి చేసెనో చూచితిరా?

నే నావిత్తము స్వేచ్ఛావిహారము కీయనని యూహించి మార్గంబున నొక యగాధమందు నూయిగనంబడిన దానివింత నాకు జూపించువానివలె నభినయించుచు నేను దానిలోనికిఁ దొంగిచూచుచుండ నా రెండు పాదంబులు నెత్తి నన్ను దానిలోఁ బడద్రొబ్బి యా ధనంబంతయు దీసికొని యింటికరిగెను. దుష్టులకు జేయరానికృత్యము లుండునా? కూపంబునంబడిన తోడనే దైవకృపచే నీటిమట్టమున గోడలో మొలచిన మఱ్ఱిమొక్క యొక్కటి నా చేతికి దొరికినది. దాని యాధారమున నీటిలో మునుగక తేలియుంటిని. ఇంతలో బాటసారులెవ్వరో యాత్రోవం బోవుచు నీటికై వచ్చి యా బావియందు దేలి కొట్టుకొనుచున్న నన్నుజూచి "మనిషి మనిషి" యని యఱచుచు నతివేగంబునఁ బగ్గంబును గెడలు నాకూతగా నిచ్చి మెల్లన నన్నుఁ బైకిదీసిరి. సముద్రంబు వెడలివచ్చు లక్ష్మియుంబోలె నొప్పుచున్న నన్నుఁజూచి యాపుణ్యాత్ములు విస్మయమందుచు నా వృత్తాంతమడిగి తెలిసికొని మాతండ్రి ప్రసిద్ధియంతకు మున్న వినియున్న వారగుట మిగుల నాదరముతోఁ గొనిపోయి నన్ను మా తండ్రి కప్పగించిరి.