పుట:కాశీమజిలీకథలు -01.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రౌంచద్వీపముకథ

143

పూర్వము విక్రమసింహుఁడు సింహభీతిచే నెక్కినచెట్టుమీదనే వ్రాలెను. దైవానుకూలదినములలో నొరులు తనకుఁ జేయు సహకారములు నుపకారములే యగును. విక్రమసింహుని మరణవిధికై నడిపించిన వామనుల దురాలోచన మతనిని స్వదేశము జేర్చినది.

అప్పుడు విక్రమసింహుఁడు మెల్లన కొమ్మలఁ బట్టుకొని పుడమికి దిగి యది మున్ను దాను బహుశ్రుతునితో వియోగమునొందిన బ్రదేశముగాఁ దెలిసికొని దైవగతి ననేకగతులఁ కొనియాడుచు బహుశ్రుతుని గుఱించి పరిపరిగతులం దలంచుచు నతని జాడ దెలియఁగోరి కొంచెము సాగినంత నతం డెదురుగా వచ్చుచుండెను.

అల్లంత దవ్వున వానింజూచి విక్రమసింహుఁ డంతరంగమున నోహో! యితండు బహుశ్రుతుడేనా? కాఁడు. అంతటి భాగ్యము నాకింతటిలో లభించునా ? వాని విడిచి సంవత్సరమైనది. ఇంతదనుక నిందే యుండునా ! అని వేతెఱంగుల దలపోయుచుండెను. విక్రమసింహునిం జూచినతోడనే యతనికిఁ దోచిన యూహ లన్నియు బహుశ్రుతుని హృదయమందును జనించినవి.

ఇరువురు దారసించినతోడనే యోహో బహుశ్రుతా! కనంబడితివా ! యనియు ఏమి నా ప్రాణమిత్రుఁడు విక్రమసింహుఁడే యనియు నొండొరులఁ బలకరించు కొనుచు గాఢాలింగనములు సేసికొని పెద్దతడవు కంఠంబుల నెలుఁగు రాక యట్టు నిలువంబడి యెట్టకేలకుఁ దెరపి తెచ్చుకొని యొక చెట్టునీడం జేరి యన్యోన్యముభావ లోకనంబులం దనివినొందక యానంద మందుచున్న సమయంబున బహుశ్రుతుం డిట్లనియె. అన్నా! విక్రమసింహా! ఎందుబోయితివి? నీవేమేమి వింతలం జూచితివి? ఇన్ని దినంబులును సుఖంబుండితివి కదా! నేడీ యుదయఁ మిచ్చటి కెట్లు వచ్చితివి. ఎఱింగింపు మనుటయు విక్రమసింహుడు తాను సింహభీతిచేఁ జెట్టెక్కినది మొదలు బహుశ్రుతునం జూచువరకు జరిగిన కథ యంతయుఁ జెప్పెను.

బహుశ్రుతుఁడు వయస్యా! నీ వెండతాకున దాహార్తుండవై పడియుండ జలంబులు దేర నే నరిగితినిగదా! అట్టరిగినంత ప్రాంతముననే వింతయగు నొక కొలను గనంబడినది. దాని విలాసంబు మానస సరోవరంబునకైన లేదని నుడవవచ్చును. దాని కచ్చెరువందుచు నలుదెసలఁ బరికించుచుండ నొకదండ శిలాఫలకంబున ఇది పురుషద్వేషిణీ విహార సరోవరంబు దీని చెంతకుఁ బురుషులు రాఁగూడదు. వచ్చినవారికి మరణదండన విధింపబడు"నని వ్రాయబడియున్నది.

దానింజదివి భీతియు సంభ్రమంబును జనింప నట్టియుత్సాహంబు నీ కెఱింగింపఁగోరి యతిజవంబున జలంబుల నొక పర్ణపుటంబునం బట్టి యిచ్చటికి వచ్చితిని. ఇందు నిన్ను గానక పెద్దయెలుంగున విక్రమసింహా! యని పెక్కుసారులడవి ప్రతి