పుట:కాశీమజిలీకథలు -01.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మనమును మన సంతానమును మృగములవలె నిఁక నడవిపాలు గావలసివచ్చును. తన సతి యుపపతితోఁ గ్రీడించుచుండ నెట్టి నీచునకైనను మనంబున నీర్ష్య జనింపకుండునా? వీఁడు మనకు శత్రువు. వీని నెట్లయిననుఁ బరిభవింపఁవలయును. మనలోఁ గొందఱికి రాణి యంతఃపురమున కరుఁగ జనువు గలిగియున్నదిగదా! రాత్రివాఁడు నిద్రించునప్పుడు మంచముతోఁగూడ మోచికొనిపోయి సముద్రంబునం బారవేయుద మని యొండొరు లాలోచించుకొని యారేయివాఁడు నిద్రించుచున్న మంచము మెల్లన నెత్తుకొని యతిరవంబున సముద్రంబునం బారవేయుటకై నడుచుచుండిరి.

ఇంతలో విక్రమసింహుఁడు మేల్కొని కన్నులు దెరచిచూడ నాకాశమును నక్షత్రంబులు గనంబడినవి. వెరచి యతండదిరిపడి లేచి మంచముమీఁద గూర్చుండి యావామనులాడుకొను వాక్యములు కొన్ని విని వారు దన్ను సముద్రంబునం బడవేయఁ గొనిపోవుచున్నవారని నిశ్చయించి తప్పించుకొను నుపాయం బరయుచుండ నొక వృక్షము క్రిందుగా నరుగునప్పు డాతండు తెప్పున శాఖనందుకొని యాచెట్టుపై కెగఁబ్రాకెను.

వారది యెఱుంగక క్రమంబునంబోయి యా మంచమును సముద్రంబునం బారవైచి తమ దాయాదుఁడు హతుఁడయ్యెఁగదా యని సంతోషముతో నింటికరిగిరి. రాణియు నచ్చటి స్త్రీలందఱు మరునాఁడు విక్రమసింహునింగానక పెక్కు తెరంగుల శోకించుచుఁ దుదకుఁ దమ పురుషుల కపటమువలననే హతుఁడయ్యెనని యెఱింగి యట్టివారిని నుగ్రశిక్షకుఁ బాత్రులఁజేసిరి. కాలక్రమంబున యౌవనవంతుడైన విక్రమసింహుని పుత్రుఁడే యాదీవికి రాజయ్యెను. ఇదియునుంగాక బ్రహ్మసంతతికిఁబోలె నాదీవియంతయు విక్రమసింహుని సంతతియే క్రమంబున వ్యాపించెను.

అర్ధరాత్రంబున విక్రసింహుడట్లు చెట్టుపై కెఁగబ్రాకిన తోడనే మున్ను తన్ను జంబూద్వీపమునుండి క్రౌంచద్వీపమునకుఁ గొని తెచ్చిన బక్షియే యందు బరుండియున్నది ఆ సంగతి యతం డెఱుఁగక పూర్వమువలె దానిరెక్కల సందున దాగి యున్నంత నప్పతంగంబు దైవగతి రివ్వున నెగసి మరల జంబూద్వీపాభిముఖముగాఁ నతిజవంబునం బోవఁదొడంగినం జూచి యతండోహో! యిది మునుపటి పక్షిలా గున్నది. నన్ను మరల జంబూద్వీపమునకుం గొనిపోవుచున్నదాయేమీ? నాయందు దైవమున కనుగ్రహమువచ్చి యుండఁబోలు. కష్టములు కోరక సంప్రాప్తించునట్లు కాలక్రమంబున సౌఖ్యంబులు నొనగూడునని పెద్దలు చెప్పుదురు. ఆ మాటలు నేఁటికిఁ దార్కాణమైనవి.

దైవము నన్నుఁ రక్షించుఁగావుతమని యనేకప్రకారంబుల భగవంతుని ధ్యానించుచుండ మార్తాండుం డుదయగిరిశిఖర మలంకరించినంత నా శకుంతంబు