పుట:కాశీమజిలీకథలు -01.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రౌంచద్వీపముకథ

141

దేటపడగా నాబోఁటి యతనితో నాథా! నీ కరుణావిశేషంబునఁ బుత్రుండుదయించు లక్షణములు గనఁబడుచున్నవి. కొన్ని నెలలవఱకు నాకు బురుషసాంగత్యముకూడదు. నాకు కుసుమగంధి యను చెల్లెలు గలదు. అది రూపంబునకు శీలంబునను నన్నుమించి యున్నది. అంతదనుక దాని డెందంబున కానందము సంఘటింపుమని యవ్వనితను రప్పించి యతనికిఁ జూపించిన సంతసించి నాటంబోలె యా విక్రమసింహుఁ డాతలిరుబోణితోఁ గ్రీడించుచు దానికిఁ గూడ నెలతప్పినచొప్పు తెల్లమైన తోడనే యావాల్గంటి నంట మానివేసెను.

అప్పుడాయూరఁగల నారీమణు లావిధంబెరింగి యారాణి ననుమతిం బ్రతిదినమును వంతుప్రకారమరిగి యతనివలన నభీష్టకామంబులఁ దీర్చుకొనుచుండిరి.

విక్రమసింహుఁ డాభాష సాంగముగా నెరింగియున్న కతంబున నప్పుడప్పుడు సభలుచేయుచు వారి దురాచారముల గుఱించి యుపన్యాసములు వ్రాసి చదువుచుఁ గ్రమంబున వారి క్రౌర్యముల దగ్గింపఁ దొడఁగెను.

మఱియు నొక శుభలగ్నంబున నారాణికొక పుత్రుం డుదయించెను. ఆ బాలుండును నా దేశపు శిశువులవలెఁ గాక సర్వావయవ సుందరుండై యుండుటం జూచి రాణియు బంధువులు నానందమందుచుఁ గ్రౌంచద్వీప చక్రవర్తి యుదయించెనని ప్రకటింపం దొడంగిరి.

కాలక్రమంబున విక్రమసింహునితోఁ గ్రీడించిన చేడియలందఱు నందముగల నందనులంగనిరి. అప్పుడందఱు నా విక్రమసింహువి క్రౌంచద్వీప పురుషులకుఁ గల దుర్దశలఁ బాపుటకై వచ్చిన పరమేశ్వరుఁడని వినుతించుచు నతఁడు చెప్పిన పనులెల్లఁ జేయ సిద్ధముగ నుండిరి.

అట్టి గౌరవము వచ్చినప్పుడు గూడ విక్రమసింహునకు మిత్ర వియోగ సంతాపంబు ద్వీపాంతరవాస క్లేశంబును సంతోషమును గలుగ నిచ్చినవికావి. అతఁడు పెక్కు తెరంగుల దన దేశమునకుఁ బోవ బ్రయత్నించెను గాని అచ్చటివారికి జంబూద్వీపనామమే తెలియమి నట్టి యుద్యోగము కొనసాగినదికాదు.

ఆ దేశ స్త్రీలకుఁ బూర్వమే పురుషుల యెడ గౌరవమలఁతియై యున్నది. విక్రమసింహుఁడు వచ్చినది మొదలమ్మదవతులు పతుల మరియుం జుల్కనగాఁ జూడఁదొడంగిరి.

ఒకనాఁడా దేశ పురుషులందఱు నొక్కచోటఁజేరి యిట్లు తలపోసిరి. అయ్యో! మనగతి యేమైనదియో చూచితిరా. మనభార్య లందఱు మనలం జూడక యెచ్చట నుండియో వచ్చినవాని యెడ మక్కువ గలిగి వానితోఁ గ్రీడించుచు సంతానమును గనుచుండిరి. కొలఁది కాలములో నీ దీవియంతయు వాని సంతానమే వ్యాపించును.