పుట:కాశీమజిలీకథలు -01.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రౌంచద్వీపముకథ

139

నప్పొలఁతియు సంతసముతో నందులకియ్యకొని చయ్యన వారివెంట నడువజొచ్చెను.

ఇంతలో నింకొక నెలంత యంతిరమున కరుదెంచి యాదేశమునకు వింతగా నున్న విక్రమసింహునిఁ జూచి మోహముతో నోహో! ఇంతులారా! యింత సొగసుకాని నెక్కడ సంపాదించితిరి? నాకుఁగూడ భాగమీయవలయును. అనుటయు వారొడంబడనినాఁడు తమగుట్టు బయలగుననియే యట్టిపని కియ్యకొనిరి.

ఆ ముగ్గురు మగువలు వానిందోడ్కొని వేగముగాఁ బోవుచుండుటయు మరి యిరువురు తరుణులు గనంబడి వాని సోయగంబున కచ్చెరువందుచుఁ దమకుకూడ వానిం బతిజేయుఁడని మొదటివారిం బ్రతిమాలిరి.

అప్పనికొప్పుకొని యప్పడతులెల్ల నడచుచుండ నింతలోఁ బురంబంతయు వింతపురుషుఁడు వచ్చెనని ప్రతీతి మ్రోయ నాయూరంగల కలకంఠులెల్ల నుల్లములలర వానింజూచుటకై గుంపుగుంపులుగా రాఁదొడగిరి. అచ్చటి స్త్రీలకేగాని పురుమల కేవిధమగు స్వాతంత్ర్యములేదు. దానజేసియే యాదేశంబున స్త్రీలకు జారత్వము నింద్యము లేదు.

వచ్చినవారెల్ల వానిం జూచి విస్మయమందుచు దమకుఁ బతి జేసుకొనవలయు నని నుద్దేశముతోఁ దమ యిళ్ళకు రమ్మని సూచించిరి. కాని విక్రమసింహుఁడా నెలంతలరాక యంతయుం జూచి స్వాంతమున బెక్కు తెరంగులఁ జింతించుచు నెవ్వరివెంట బోక మొదటఁ దన్ను జూచిన పుష్పవతి యింటికే యరిగెను.

అదియు నతని బహుప్రకారముల సత్కరించెను. దాని సత్కారము లేమియు వాని హృదయమునకు సంతోషము గలుగజేసినవి కావు వారి యాహార విహారములు గూడ వానికి మిగుల విపరీతములుగాఁ గనంబడినవి. పచ్చిమాంసమునే భుజింతురు. కోపము వచ్చినపుడు మగవారిం జంపి తినుచుందురు. విక్రమసింహుఁడందుఁ బాల చేతను ఫలములచేతను నాకలిదీర్చుకొనుచుండె. ఏ విధమైన మాంసమును దినుట లేదు.

పురుషద్వేషిణీవిరహసంతాపమూలకమగు మిత్రవియోగ శోక మతని హృదయమునం దత్పురవాస క్లేశము బలపరచు చుండెను.

బుద్ధిమంతుడగు నతండు పదిదినములలోనే వారి భాషా మర్మమంతయు గ్రహించి వారు చేయు దారుణ కృత్యములకు భయపడుచు మాట్లాడనచోఁ దగుల మెక్కుడగునని భాష రానివానివలెనే యభినయించుచుఁ దరుచు మౌనముగానే యుండెను.

ఇట్లుండునంత నన్నెలంత యొక్కనాఁడు తన్నుఁ గామగ్రీడల దేల్చుమని బ్రతిమాలినతండు పెక్కుగతులనట్టి పనిమాని వేయుటయే యుత్తమమని తలంచెను