పుట:కాశీమజిలీకథలు -01.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

కుమారుఁ జూచి మోహించి తనభాషలో నీ వెవ్వఁడవని యడిగెను. ఆమాట వానికిఁ దెలియక నతఁడు మరల దానితో నీవు చెప్పినది నాకుఁ దెలియలేదు. నీ వెవ్వతెవని యడిగెను.

అతని మాటయు దానికిఁ దెలిసినది కాదు. ఇట్లొండొరుల యభిప్రాయములు మాటలచేఁ దేటవడమి వెరగంది చూచుచుండ నమ్మత్తకాశిని హస్తసంజ్ఞచే నతనిఁ దన యింటికి రమ్మని సూచించినది .

అతండప్పు డేమియుఁ జేయునదిదోచక వెంటవచ్చెదనను భావము మరల సంజ్ఞ మూలముగానే తేటపరచెను. అది క్రౌంచద్వీపమునకు రాజధానియైన యేకశిలానగరము. దానిం గ్రౌంచవతియను రాణి పాలించుచున్నది. అందున్న స్త్రీలకు మిగుల చక్కఁదనము గలదుగాని వారికృత్యములు రాక్షసకృత్యములు. పురుషు లందఱు నల్లని కోతిముఖములవంటి ముఖములు గలవారును బొట్టివారు నగుట వికారముగ నుందురు.

పూర్వము రామరావణయుద్ధంబున మూర్చంబడియున్న లక్ష్మణునిం బ్రతికింప హనుమంతుఁడు ద్రోణగిరిఁదెచ్చి వెండియు నగ్గిరిఁ దీసికొనిపోవుచు నాక్రౌంచద్వీపమున నొక నిమిషము విశ్రమించెను. మిక్కిలి చక్కనివారగు నచ్చటి పురుషు లతనిం గని పరిహసించిరి, దానం గోపించి యప్పవననందనుఁ డందున్న పురుషులను వారికిఁ బొడము పుత్రులును వానరముఖములును వామనులై యుందురనియు స్త్రీలు రాక్షసకృత్యంబులు గలవారై యొప్పుదురనియు శపించి యేగెను. సాధులంగని పరిహసించిన పాతక మూరకపోవునా?

అట్టి దీవియందు మిక్కిలి చక్కనివాఁడగు విక్రమసింహునిఁ జూచి యా చిన్నది సంతసించుట యేమి యాశ్చర్యము ? పట్టరాని యానందముతో నారాచపట్టిని వెంటఁబెట్టుకొనిపోవుచు నా బాలిక దన యేలికసానియైన క్రౌంచవతి కావృత్తాంతము దెలిసినచో వానిఁ దనకు దక్కనీయదను భయమున నతని రహస్యముగాఁ దన యింటికిఁ గొనిపోవఁదలంచెను. తాననుకొనిన యట్లు చేయసాగినదికాదు.

దారిలో మరియొకతె దారసిల్లి పుష్పవతి యను పేరంబరగు మొదటిదానిం జూచి యక్కా! ఇంత చక్కని పురుషుం డెక్కడనుండి వచ్చెనే? పురుషులలోఁ గూడ నింత వింతగలవారుందరు కాఁబోలు. వీనికథ యెట్టిదని యడిగినది. నాతి! యీతఁడెందుండి వచ్చెనో యెవ్వండో నాకుఁ దెలియదు. ఇప్పుడే చూచితిని వీని యందు మనభాష తెలియని లోపమొక్కటియే యగుపడుచున్నది. మనమిరువురము వీని రహస్యముగా నింటికిఁ దీసికొనిపోయి పెండ్లి యాడుదుము. మనరాణికిఁ తెలిసినచోఁ గామాతురురాలగు నామె వీని మనకు దక్కనీయదు సుమీ! యనుటయు