పుట:కాశీమజిలీకథలు -01.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమసింహుని కథ

135

ఘట్టమునకు స్నానమున కరుగునప్పు డట్లు చాటించుచుండ నేనాలించి యమ్మించుబోణి యెంత చక్కనిదోయని దానిం జూచు వేడుక నా కెడదబొడమిన బెక్కు తెరంగులఁ జింతించి తుదకొక్క యుపాయ మూహించితిని.

నేను జలస్థంభనముఁ జేయగలను. ఆమెకన్న ముందరనే యరిగి మణికర్ణికాఘట్టంబున జలంబుల మునింగియుంటిని. పిమ్మట నావాల్గంటియుఁ బెక్కురు చెలికత్తియెలు బెత్తంబులం బూని చుట్టును ముట్టిరా నాఘట్టంబున కరిగి మాటుగట్టిన పుట్టుంబు టెంకి బల్లకిదిగి గంగలో మోకాలిబంటి జలంబున నిలిచి చెలికత్తెయలు కనకకలశంబు లెత్తి జలంబులు పై నిడ దీర్థమాడెను. జలచరభీతిచే నవగాహస్నాన మాచరించినది కాదు. దానంజేసి జలంబుల మునిగియున్న నాకు నీటితో గుందనపుకమ్ములవలెఁ దళుక్కురని మెరయుచుఁ దదీయ పదాంగుష్ఠంబులు మాత్రము గనంబడినవి. యితరాకార మేమియు గనంబడలేదు.

స్నానముఁజేసి యాసరోజముఖి యేగిన వెనుక నేనును జలంబు వెడలివచ్చి సాముద్రికశాస్త్రమంతయు బూర్ణంబుగాఁ జదివినవాఁడ నగుట నాయంగుష్టంబు పోలికంబట్టి రూపమంతయు వ్రాసితిని ఆ సుందరి యట్లుండుట కేమియు సందియంబు లేదు.

దాని నట్లు వ్రాసి దేశంబునకు వచ్చుచు దారిలో మీరు చూచిన సత్రమున నొకనాఁడు బసచేసి యది పదుగురు వచ్చిపోవు సత్రమని యూహించి అది యందు వ్రేలఁగట్టి యేగితిని. ఇదియ దాని వృత్తాంత మింతకన్న నా చిన్నదాని దేశ, కుల, శీల నామంబులు నాకుఁ తెలియదని యెఱింగించిన నా మంత్రినందనుండు తలకంపించుచు నోహో! యిక్కార్యము సమర్ధింప మిగుల నసాధ్యముగనున్నది. ఆ చిన్నది యున్న నెలవు వీనిమాటలచేఁ దేటపడలేదు. విక్రమసింహుని విరహతాప మగ్గలమగుచున్నది. దైవానుగ్రహ మెట్లున్నదో గదాయని పరిపరిగతులఁ దలపోయుచుండ బహుశ్రుతునకు విక్రమసింహు డిట్లనియె.

అన్నా! యీచిత్రకారుని మాటలు వింటివిగదా? పురుషద్వేషిణి యను పేరం బరగు నా నారీమణి పటములో నున్నట్లుండుట కేమియు సందియములేదు. తనకు సరిపడిన పురుషుల లేమింజేసి సామాన్యులఁ జూడనొల్లకయే యప్పల్లవపాణి పురుషద్వేషిణి యనుపేరు పెట్టుకొనినది. ఎట్లయినను వెదకి యమ్మదవతిని నాకుఁ గూర్తు నంటివేని మేనఁ బ్రాణంబులఁబూనియుందును. లేనిచో నిప్పుడ యొడలు విడుచువాఁడ నాయుల్లంబెల్ల నప్పల్లవాధరి దరిజేరయున్నది. దీనికేమని యెదవని యడిగిన నతండు శీఘ్రకాలములో నీధరిత్రి నెక్కడనున్నను నాచిన్నదానిం దెచ్చి నీకుఁ బెండ్లి చేసెదనని ప్రతిజ్ఞ చేసెను.