పుట:కాశీమజిలీకథలు -01.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

129

కాతెఱం గెఱింగించి యచ్చటికిఁ దీసికొని వచ్చిరి. నిశ్చేష్టితుండై పడియున్న రాజుం జూచి అయ్యో! అయ్యో! యని గుండెలు బాదుకొనుచు నింక నన్ను మన్నించువా రెవ్వరు? నాపారితోషిక మియ్యలేదే. యేమి చేయుదురు. పెక్కుచిక్కులు పడి యుప్పడుచుం దీసికొని వచ్చితినే. యేమియు లేకపోయినది. హాదై వమా! యని నేడ్చుచున్న యన్నీచురాలి జూచి రాముడిట్లనియె. అవ్వా! నీ వీరాజున కేమి యుప కారము జేసితివి. ఆతఁడు నీ కేమి కానుక లిత్తునని చెప్పెను చెప్పుమనుటయు నావృద్ధ యిట్లనియె.

అయ్యలారా! నే నీతండు కోరిన చిన్నదానిని ద్వీపాంతరమున నుండి తీసుకొని వచ్చితిని అర్ధరాజ్య మిచ్చెదనని వాగ్దత్తము చేసి యున్నాడు. వెంటనే యడుగుటకు నాచిన్నది వీని వరింప సంవత్సరము వ్రతము నెపంబున మితిగోరినది. అందుమూలమున వీలుపడినది కాదు. ఇంతకును నేను దురదృష్టవంతురాలను అని యాకథ యుంతయుం జెప్పినది. అప్పుడు ప్రవరుఁడు వసంతుని జూపుచు అవ్వా! యీతని నీ వెప్పుడైనఁ జూచితివా యని యడిగిన నామె యతనిం జూచి గురుతుపట్టి గుండె ఝల్లుమనఁ దెలతెలపోవుచు నెచ్చటనో చూచినట్టే జ్ఞాపకమున్నదని పలికినది. అప్పుడు వసంతుడు కోప మాపనేరక యట్టె లేచి దానిం జంప గమకించిన నడ్డము వచ్చి ప్రవరుండు స్త్రీవధ మహాపాతకము. దీని వేరొకరీతి శిక్షింతమని దాని నప్పుడు పెడకేలు కట్టించెను.

ఆ చర్యలన్నియుం జూచి రాజపత్ని వెరచుచు వారి పాదంబులం బడి పతిభిక్ష పెట్టుఁడని వేడుకొనినది. అప్పుడు ప్రవరుండు సాధ్వీ! వీరు నా మిత్రులు. ఈ రాజు చెరఁకొని తెప్పించిన చిన్నది యీ వసంతునిభార్య. ఈతడు సార్వభౌముని కుమారుఁడు మేమందరము తల్లిదండ్రు లెఱుంగకుండ నిల్లు వెడలి దేశాటనము చేయుచుఁ జిక్కు లం బడితిమి. దైవకృపచే నందఱము చేరుకొంటిమని తమ వృత్తాంత మంతయుం జెప్పెను.

ఆ కథవిని యామె వెరగుపడుచుండ నారాజు తటాలున లేచి వారి పాదములం బడి మహాత్ములారా! మీరు లోకాతీతులు. ఏమి చేసినను చేయగలరు. మీ పాదసేవకుండనై బ్రదికెద. రక్షింపుడు. నా యపరాధంబుల మరువుఁడు. కళావతిని నేను ముట్టలేదు. ఆ చిన్నది సాధ్వీతిలకమని చెప్పఁదగినది. నన్నుఁ గన్నెత్తియైనఁ జూచి యెఱుంగదు. గడ్డిగరచితినని యనేకప్రకారములఁ బ్రార్థించెను. దయార్ద్రహృదయు లైన వరప్రసాదు లారాజుం గరుణించి విడిచిపెట్టి యావృద్ధబ్రాహ్మణిని మాత్రము విడువక గెంటుకొనుచుఁ గళావతియున్న యంతఃపురమునకుఁ దీసికొనిపోయిరి.