పుట:కాశీమజిలీకథలు -01.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రాజు – నాకు లోపలినుండి చలివచ్చుచున్నది. నిలువలేకున్నాను. బిగ్గరగాఁ బట్టుకొనుము. (అని ముసింగిడుకొని మంచముపై పండుకొనుచున్నాఁడు)

ఇంతలో పరిచారకులు వచ్చి అమ్మా! రాజుగా రెచ్చట నున్నారు. వారెవ్వరో సభాభవనంబంతయుఁ బ్రతిధ్వను లీయ సింహనాదములు సేయుచు వెరపుగలుగ రాజుగారినిఁ దీసికొనిరండని మాకు నియోగించిరి. ఇ ట్లుపేక్ష చేయుచున్నా రేమి? ముందటివార్త తెలియలేదా యేమి యని చెప్పిన విని యామె తెలిసినది. దానికే యాలోచించుచున్నాము. మీరు గ్రమ్మర జని రాజుగా రస్వస్థులై యున్నవారని చెప్పి మనమంత్రి నొకసారి నేను రమ్మంటినని చెప్పి తీసుకొనిరండు పొండని పంపెను.

వాండ్రు పోయి కొండొకవడి మరల నరుదెంచి అమ్మా! తమవార్త మంత్రిగారితో చెప్పితిమి. మామాటలు విని వారు నవ్వుకొనిరి. అది యేమి సాంకేతికమో తెలియదు. మంత్రియొక్కఁ డేల మేమందరము వచ్చుచున్నారము. రాజుగారి రోగకారణ మరిసెదమని చెప్పి బయలుదేరిరి.

అని చెప్పునంత రాజు తటాలున లేచి వస్త్రమాల్యానులేపనార్యలంకారములఁ దీసివైచి మలినవస్త్రంబులఁ దాల్చి పారిపోవఁ బ్రయత్నించుచుండ రాజపత్ని పోవలదని నిర్బంధించి పట్టుకొనినది. ఇంతలో వరప్రసాదు లచ్చోటికి వచ్చిరి. రాజును మంచముపై ముసింగిడికొని యెన్నఁడో చచ్చినవానివలెఁ బరుండియుండెను.

అప్పు డారాజపత్ని చాటున నిలిచి ప్రవరునితో అన్నా! అమాత్య ప్రవర! నీవిట్ల కృతఘ్నుండవై వీరి నేటికిఁ దీసుకొని వచ్చితివి ? వీ రెవ్వరు? వీరికి మే మేమి యపకారము గావించితిమి? రాజుగారితో వీరి కేమి పని యున్నదని యడిగినఁ బ్రవరుండు సాధ్వీ! వీరి వృత్తాంతము చాల కలదు. పిమ్మటం జెప్పెదం గాని యీతం డి ట్లచేతనుండువోలెఁ బడియుండుటకుఁ గారణ మేమని యడిగిన నచ్చేడియ యేమియుం బలుకక యూరకున్నది.

అప్పుడు ప్రవరుఁడు రాజునొద్ద కరిగి ముసుంగు దీసి చూసెను. కన్నులు తేలవైచి పళ్ళు బిగియఁబట్టి యూపిరి రానీయక గతాసుండట్లున్న యన్నరనాథుం జూచి వరప్రసాదులు పకపక నవ్వదొడంగిరి. అప్పుడు ప్రపరుఁడు పెద్ద యెలుంగున రాజా! రాజా! యని పిలిచి పలుకకున్నంత స్వాంతమున విస్మయమువొందుచు అయ్యో! యీ నృపాలుం డకారణమువ జేతనముబాసిన వావివలె నొప్పుచున్నాడు. వీనికిఁ దగినచికిత్స జేయింపవలయును. వీనితత్వ మెఱింగినది బ్రాహ్మణవిస్వస్తయొకతె యుండవలయును. ఆమెను దీసుకొని రండని కొందరు కింకరుల బంపెను.

అ జరఠయు నంతకుమున్న యన్నరపతికి ప్రాణోత్క్రమణసమయమైన మాట విని వడివడి వచ్చుచున్నది. కావున వారి కెదురు పడినది. అప్పుడు కింకరులామె