పుట:కాశీమజిలీకథలు -01.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

127

సభా — వారు మైత్రి సేయ నరుదెంచినచో సింహాసనము నాక్రమింతురా ? యుద్ధసన్నద్ధులై రానేల? వారి యాకారములు తేరిచూడ శక్యము కాకున్నవి గదా?

రాజు - అలాగునా! అలాగునా! (అని వడంకుచు భార్యతో) కాంతా! యీ యుదంతము వింటివా? యిప్పు డేమి చేయఁదగినది.

రాజపత్ని - క్షత్రియవంశమునఁ బుట్టి యిట్టి పిరికితనం బేటికి బూనెదరు కత్తి గట్టి పరాక్రమముతో సంగరంబున శత్రుల బరిభవింపుఁడు.

రాజు - సంగరమని సులభముగా బలికితివి నేను జిన్నతనములో నెంత గారాబముగాఁ బెంపఁబడితినో యెఱంగుదువా? యించుక దెబ్బయైనఁ బడి యెరుంగను. అట్టి నేను అసిధారాపాతంబుల నెట్లు సైరింతును?

పత్ని - అయ్యో! సంగరవీరులగు క్షత్రియకుమారు లెల్లఁ జిన్నతనమునందు దెబ్బలు పడినవారేనా? శ్రీరాముని కన్నను అర్జునుని కన్నను మీరు సుకుమారులా? వా రెట్టి సంగ్రామంబులం గావించిరి.

రాజు — సీ! నీ యాడుబుద్ధి పోనిచ్చుకొంటివికావు. చెప్పినం దెలియదేమి. వారివలె నేనడవులఁ గ్రుమ్మరి కాయగూరల దింటినా? నా సుకుమారత నీ కేమి యెఱుక.

పత్ని – మీ రట్టివారే కానిండు. ఇప్పు డేమి చేయుదురు?

రాజు - రెండవదారిం బారిపోయి ప్రాణములు దక్కించుకొంట లెస్సయని తోఁచుచున్నది. అట్లుచేయుట నీ కభిమతమేనా?

పత్ని - పారిపోయిన మనమెన్ని దినములు బ్రతుకుదుము. ఈ యపఖ్యాతి వసుంధరఁ దిరంబై యుండదా.

రాజు — ఉన్నను సరియే కాని నేను పోరుసేయనోప (అని బలుకుచున్న సమయంబున నెవ్వరో వచ్చుచున్న యలుకుఁడు వినంబడునంత వడంకుచుఁ బారిపోవ బ్రయత్నించుటయు నడ్డపడి బిగ్గరగాఁ బట్టుకొని)

పత్ని - అయ్యయ్యో! శత్రువుల బలాబలముల దెలిసికొనక యెద్దియో యలుకుడైన నడలుచు నూరక పారిపోవ బ్రయత్నింపనేల? నిలువఁ డేను బోయి సంధి చేసికొని వత్తును.

రాజు — విడువిడు. అదిగో వా రిక్కడికే వచ్చుచున్నట్లు తోచుచున్నది. నిలిచితివేనిఁ బ్రాణహాని కాగలదు. నీవు వారితో మాట్లాడి సంధి కుదిరినచో నాకు వార్త నంపుము. వెండియు రా కెక్కడికిఁ బోవుదును.

పత్ని - వారు శత్రువులు కారు. అదిగో మనపరిచారకులే వచ్చుచున్నారు. భయము విడచి నిలువుఁడు.