పుట:కాశీమజిలీకథలు -01.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యెడ గ్రమంబున నడిపింపఁదగినవి గదా? తొలుత నతనియెడ సామంబు ప్రయోగించి యొడంబడనినాఁడు దండంబ కర్తవ్యము. ఇంతకును మనప్రవరుని యనుమతి యెట్లున్నదో విచారింపు మనుటయుఁ బ్రవరుం డిట్లనియె.

అన్నలారా! యారాజు పరాక్రమమునను బుద్ధికౌశల్యమునను మనలను మించినవాఁడు కాఁడు. సర్వసేనలు నాయధీనములోనే యున్నవి. తృటిలో నీకోట స్వాధీనము చేసికొనఁగలము. కాని కృతఘ్నతాభీతి నన్ను బాధింపుచున్నది. కావున మనరాముఁడు చెప్పినట్టు సామంబుననే సర్వకార్యములు చక్కఁబరచుకొనవచ్చును. సామం బెవ్వరికిని మేలు. దైవప్రతికూలదినములలో నితండు మనల నింత జేసెంగాని యిప్పు డేమి సేయఁగలఁడు. ఒండు వినుం డిప్పుడ యప్పుడమియొడయనికడ కరిగి యీవిషయము వినిపింత మనుటయు నందుల కందరు నియ్యకొనిరి.

పిమ్మట వారేగురు నడుములఁ గాసికోకలు బిగియించి జెట్టిలాగులు నీలికంచులు నీలికంచుళులు నరుణోష్ణిషంబులుఁ దాల్చి భయంకరవేషములతో గరంబుల గరవాలంబులం బూని భూమి కంపించునట్లు చటులగతి నడుచుచుఁ జూచినవారెల్ల బీతిల్లి యోరసిల్ల నల్లన నమ్మహీవల్లభు నాస్థానంబు జేరి రాజసింహాసనముమీఁద వసంతుఁడును ప్రాంత పీఠంబులం దక్కినవారును గూర్చుండి తత్సభారక్షకునిచే రాజునకు వార్త నంపిరి.

వాఁ డతిజవంబునం బోయి యంతఃపురంబున భార్యతో వినోదంబుననున్న యన్నరపతిం జూచి స్వామీ! అయినది. అయినది. తమ సింహాసనము శాత్రవు లాక్రమించుకొనిరి. ఏమిటికో దేవరను దీసుకొనిర మ్మనిరి. మీఁదటికార్య మాలోచించుకొనుడని యా వృత్తాంతమంతయుం జెప్పెను.

రాజు — ఓరీ! ప్రవరుని శీఘ్రముగాఁ దీసికొని రమ్ము,

సభారక్షకుఁడు – ఎక్కడి ప్రవరుఁడు? వారితోనే వచ్చి పీఠ మాక్రమించుకొని మనలను బెదరింపుచున్నాఁడు. ఆయన మూలముననే యీ ముప్పువచ్చినదని తలంచెదను.

రాజు — మనమంత్రి యందే యున్నాఁడా! నీవు చూచితివా?

సభా — నేను జూచితిని, అందేయున్నవాఁడు. మునుపటి వేషము కాదు. వారివలెనే భయంకరవేషము వైచికొని హస్తంబున గరవాలంబుఁ బూని కూర్చున్నవాఁడు.

రాజు — ఓహో! అతనికి మనమేమి యపకారము చేసితిమి? ఇట్టి క్రౌర్య మేమిటికిఁ బూనవలయును! వారు శత్రువులు కారేమో?