పుట:కాశీమజిలీకథలు -01.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

125

కనకప్రభయుఁ గాంచనవల్లిచే నుచితసత్కారము లంది తదీయసంభాషణము లాలించుచుఁ బ్రాంతమున నిలువఁబడెను. అప్పుడు వసంతుడు రామునితో మిత్రమా! నిన్ను చూచి యెంతకాలమైనది. మాకన్నులు వాచినట్లే యున్నవి. ఈ చిన్నది ఎవ్వతె? ఎందెందు సంచరించితి వేమేమి వింతలం జూచితివి? యని యడిగిన నతండు తాను మఱ్ఱివృక్షము విడిచినది మొదలు నాఁటివరకు జరిగిన వృత్తాంత మంతయుఁ జెప్పి నిన్ననే న న్నీచిన్నది సత్రప్రాంతమందున్న సన్యాసిం బ్రార్థించి పురుషుని గావించెను. ఇమ్ముదిత దయావిశేషంబుననే నేను మిమ్ములం బొడగంటి. ఎన్నిగతుల నైన దీని ఋణంబు దీర్చికొనలేనని యా పూఁబోణిం జూపించిన వారందరు నందులకు నాసుందరి బ్రశంపించిరి.

పిమ్మట వారొండొరు లభిముఖముగా గూర్చుండి తనివిదీరని ప్రీతితో నొకరి మొగము నొకరు జూచుకొనుచుండ నత్తరి వసంతుం డిట్లనియె. తమ్ములారా! ఈ దినంబెంత సుదినమో చూచితిరా? అయత్నోపసిద్ధముగా మనమందఱ మొకతావు చేరితిమి. ఆహా! దైవవియోగ మెట్టిదో చూడుఁడు.

మ. ఎట నెవ్వారికి నెన్నిరే ల్సుఖముగానీ, దుఃఖము న్గాని, వి
      స్ఫుటపూర్వచరితాత్మకర్మవశతన్భోక్తమై యుండునో
      ఘటనాచాతురిఁ ద్రాళ్ళఁ గట్టుచు బలాత్కారంబుగా వాని న
      చ్చోటికిం దోడ్కొనివచ్చి దాని గుడిపించున్ దైవ మన్నా ళ్ళొగిన్.

పురుషకార మెందులకునుఁ బనికిరాదుసుడీ? మన మెంతకాల మెట్టియిడుమలఁ బడితిమో చూచితిరా? దైవకారంబునఁ దుదకయ్యిడుమలే మనకుఁ దలంప శుభంబు లొనగూర్చినవి.

ఉ. కోరక దుఃఖముల్ మనుజకోటికి నేగతి వచ్చు నాగతిన్
     ధారుణి సౌఖ్యము ల్గలుగు దానికి వీరిప్రయత్న మేమియున్
     గారణమై దలిర్ప దది కాలవిశేషము పట్టి వచ్చులో
     నోరిమి దక్కికుందుటయు నుబ్బుటయుంజుమి వీరధర్మముల్.

సోదరులారా! మన కింతటి యామోదం బొనఁగూర్చిన భగవంతున కనేకవందనము లౌఁగాక యని బహుప్రకారంబుల దైవకారంబునుం గూర్చి ప్రశంసించుచు మఱియు రామునితో నిట్లనియె.

రామా! కళావతీవృత్తాంత మంతయు మనప్రవరునిచే వింటిమిగదా! యిప్పుడక్కాంత నేకాంతముగా రప్పింతమా లేక నగరంబున దర్పంబు జూపి నాకందర్పకేతు నోడించి పిమ్మటఁ గొనివత్తమా! ఇప్పుడు చేయఁదగిన కృత్య మెద్దియో విచారింపు మనుటయు రాముం డిట్లనియె. సామాదిచతురోపాయంబు వై రుల