పుట:కాశీమజిలీకథలు -01.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఆ మువ్వురను దోడ్కొని రాజకింకరులు ద్వారపాలకునిచే నావార్తఁ బ్రవరునికిఁ దెలియజేసిన నతం డప్పుడు తనభార్యతో మిత్రుల గురించియే సంభాషించుచుండి యావార్త వినఁబడినతోడనే వేడుకతో వారిని లోపల ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించెను.

అప్పుడు కింకరు లోహో! వీరి నంతిపురికిఁ గొనిరండని మంత్రిగా రాజ్ఞ యిచ్చినారు. భూషించుటకో దూషించుటకో తెలియదని పెక్కుగతులఁ దలపోయుచు వారిని మంత్రియెదుట బెట్టి యాభటులు మరల సత్రముదరి కరిగిరి.

వారిం జూచి ప్రవరుండు ప్రహర్షసాగరమున మునుగుచు దన్ను దెలిసికొనెదరో లేదో యని యేమియుం బలుకక యూరకున్నంత వసంతుఁడు అయ్యా! ఇందు బ్రధానప్రవరులు మీరేనా? పరోపకారబుద్ధితో నన్నసత్రము వైచిరిగదా? అందు జూచుటయే యపరాధముగా గణింపఁబడు చిత్రఫలక మేమిటికి వ్రేలం గట్టించితిరి ? దాని మేము జూచితిమని మీకింకరులు మ మ్మపరాధులఁబోలె మీయొద్దకుఁ దీసికొనివచ్చిరి. ఇది యేమి పాలన మని యడిగిన నతండు కంఠంబు డగ్గుత్తికపడ మీ రావిగ్రహము నేమిటికి నిరూపణపూర్వకముగాఁ జూచితిరని యడిగెను. అది మామిత్రుఁడు ప్రవరుని పోలికగా నున్నది. దానం చేసి నిరీక్షించితి మనవుఁడు మీ మిత్రుఁ డేమయ్యెను. మిమ్ము మరచి విగ్రహ మయ్యె ననుకొంటిరా? యని పలుకుచుండగనే దండుఁడు గ్రహించి యీతఁడే మన ప్రవరుఁడని యరచెను.

అప్పు డతండును సంభ్రమముతో వారినెల్లఁ గౌఁగిలించుకొని అన్నలారా! నన్ను గురుతుపట్టలేకపోయితిరిగదా! మీ నిమిత్తమే నే నాచిత్రపట మందుఁ గట్టించితి. నేఁటికి మనపుణ్యము ఫలించినదని తాను మఱ్ఱికొమ్మ యెక్కి బయలుదేఱినది మొద లంతదనుక జరిగిన కథ యంతయం జెప్పి కాంచనవల్లిని జూపెను.

వారును దమతమవృత్తాంతముల వేరువేర యెఱింగించిరి. అప్పుడు వారందరు సంతోషపారావారవీచికలం దేలియాడుచు, బీఠంబులం గూర్పుండి రాముఁ డొక్కరుఁడే చేరవలసినవాఁడని యతని గుఱించి సంభాషించుకొనుచున్న సమయంబున ద్వారపాలుఁడు వచ్చి దేవా! జయపరాక్. సత్రమందలి చిత్రఫలకమును సాభిప్రాయముగాఁ జూచెనని యొక మిథునమునుఁ దీసికొనివచ్చి కావలివారలు ద్వారమందున్నవారు ప్రవేశమునకు సెలవే యని యడిగిన నతండు రాముఁడే యను సంతోషమున వడిగాఁ దీసికొనిరమ్మని యాజ్ఞాపించెను. అతం డప్పుడు పోయి యమ్మిథునమును దోడ్కొనివచ్చి వసంతాదుల మ్రోల విడిచిపెట్టిపోయెను. వా రతని దూరంబునం జూచి రాముఁడు రాముఁడను కంఠధ్వనులు పరాభవనమునం బ్రతిధ్వను లీయ నందఱును లేచి యెదురేగి యతనిం గౌఁగిలించుకొని యాలంకెలతోడనె తోడ్కొనివచ్చి యుచితపీఠంబునం గూర్చుండఁబెట్టిరి.