పుట:కాశీమజిలీకథలు -01.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

123

వత్సా! విను మమ్మువ్వురు నట్లు తిరుగుచు నొకనాఁడు సాయంకాలమున హేలాపురోభాగమున నారథం బరుగఁ దత్పురగృహదీపికాశ్రేణి నేత్రంబులకు విందొనరింప దండుఁడు అన్నలారా! ఇది యొకపట్టణమువలె నగపడుచున్నయది. ఈరేయి నిందు వసించి కళావతివృత్తాంత మరయుదమే యనుటయు వా రియ్యకొనిరి. ఆరథంబు తదీయమనోరథంబు వడువునఁ బుడమికి దిగి యవ్వీటి నడివీథి నిలుచుటయు దాని నొకచో దాచి వారు పౌరులవలన బరదేశులకు నివాసయోగ్యంబగు నమాత్యుని సత్రంబు వృత్తాంతమును విని యందుఁజేరిరి. సత్రాధికారులు వారి కారాత్రి దగురీతి భోజనసదుపాయములు జేసిరి. వారు మరునాఁ డుదయంబున సత్రపువీథి వేదికపై గూర్చుండి యందు వ్రేలఁగట్టియున్న చిత్రఫలక మీక్షించి యొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

సాంబు - అన్నా ! వసంతా! ఇటురా! ఈ పటము చూచితివా? ఈ ప్రతిమ మన ప్రవరుని పోలికగా నున్న దేమి ?

వసంతుఁడు - (చూచి) ఔనౌ నట్లె యున్నది. మన దండునిం బిలువుము. (పిలిచి) తమ్ముడా! ఈ చిత్రఫలకము జూడుము. ఇందున్న రూప మెవ్వరిదియో చెప్పుకొనుము.

దండుఁడు - ఓహో సోదరులారా! ఆమాత్రము గురుతుపట్టజాల ననుకొంటిరా? ఇది మనప్రవరునివలె నున్నది.

సాం - అచ్చగా నతనిమొగమువలెనే యున్నది. అతనిరూప మిం దుండుటకుఁ గారణ మేమో?

దం – ఒకవేళ నీచిత్రఫలకము వానిపోలికగల మఱియొక పురుషుని దేమో?

సాం - కాదు. కాదు. తప్పక మనప్రవరునిదే.

వసం — తమ్ములారా! నాకుఁ గళావతీవియోగశోకముకన్న మిత్రవియోగసంతాప మెక్కుడుగా నున్నది. వారిజాడయు నెందును దెలియరాకున్నది. హా ప్రవరా! హా రామా! మిమ్ముఁ గన్నులార నెన్నడు చూచెదనోకదా! అని కన్నీరు విడుచుచు నొండొరులు మాట్లాడుకొనుచుండ నాదండనున్న కింకరులు వారి నాటంకపరిచి యిట్లనిరి.

అయ్యలారా! తమరెవ్వరు? ఈ చిత్రఫలకమును సాభిప్రాయముగ వీక్షించితిరి గాన మిమ్ము నొండొకచోటునకుఁ బోనీయము. మంత్రిగారియొద్దకు రండు. పోదమని కరంబులు పట్టుకొనుటయు వారు జడియక యోహో! మీమంత్రి మంచిశాసనకర్తయే! చిత్రఫలకము జూచుటయే నేరమా? అట్టిది యిందేల వ్రేలగట్టవలయును? పరదేశుల వంచించుటకేనా యేమి యీసత్రము విలుపుట? పదుఁ డాయననే యడిగెద మని ధైర్యముగా వారివెంట నడువసాగిరి.