పుట:కాశీమజిలీకథలు -01.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అందయ్యింతిం జూచిన తోడనే వసంతునకు శోకంబును నక్కటికంబును నానందంబున మనంబున జనింప నాగలేక పెద్దయెలుంగున హా! "కళావతీ! యిట్లున్న దానవేయని పయింబడి కౌఁగిలించుకొనిన నులికిపడి యప్పఁడతియు నట్టెచూచి యతని తన మనోహరుఁడు వసంతునిగా నెఱింగి యోహో! నా యదృష్టమేమి? ప్రాణనాథుఁడే వచ్చెనా యిది కలగాదుగద? కాదు నిజమే తొలిజామున నెప్పుడో కొంచెము సుకృతము గావించితిని. లేకున్న నా కంతటిభాగ్యము మరల లభించునా యని యనేకప్రకారంబుల దన భాగదేయమును గుఱించి మెచ్చుకొనుచు నార్యపుత్రా! మీ జీవితాంతము గావించిన దుష్టురాలిని జూచుటకై యెట్లు వచ్చితిరి? ఏ పుణ్యాత్ముండు మిమ్ము బ్రతికించెను! పాపపు ముసలిముండ యెంత చేసినదో చూచితివా? అని త న్నాముసలిది పెట్టిన చిక్కులన్నియుఁ జెప్పి తనివివోనిచూడ్కు లతనిమొగంబున బరగించుచున్న యయ్యంగనకుఁ దనవృత్తాంతమును మిత్రులవృత్తాంతము నింతేనిం దాచక యెరింగించి వారిం జూపించిన సంతసించి యమ్మించుఁబోఁడి వారిమైత్రిని గురించి వేతెరంగులఁ బ్రశంసించెను. పిమ్మట ముసలిదానిం జూచి యది మొఱ్ఱపెట్టుచుండ జాలిపడి వారిని బ్రార్థించి దానిని గూడ విడిపించినది. దయాశాలు లపకారులనైనను శరణువేడిన రక్షింపక మానరు.

కళావతీలాభసంతుష్టి నొంది వసంతుడు మిత్రులఁ జూచి యిట్లనియె. తమ్ములారా! మనము వచ్చి పెక్కుదినంబు లైనది. మొదట శీఘ్రకాలములోనే మగుట దలంచుకొంటిమిగాని దైవగతిచే నట్లు సాగినదికాదు. ఈక్షణ మందరము కుశలముగా నొకతావునకుఁ జేరితిమి. మనకై మనతలిదండ్రు లెంత చింతించుచున్నారో వారిం జూడ వేగబోవలయుఁ గావున మీయుద్దేశ మేమనిన నందుల కందఱు నియ్య కొనిరి.

పదపడి సాంబుఁడు దండుఁడును రాగమంజరిని విద్యుత్ప్రభను దలంచుకొను నంతలో నయ్యింతులు పాణుల వీణులం బూని గాంధర్వంబు వెలయించుచు నచ్చోటి కరుదెంచిరి. ఇట్లు సపత్నీకులై వారేగురు నొక్కతావుం జేరి దండునిచే రచియింపబడిన కీలురథ మెక్కి, యచ్చటివారెల్ల నత్యద్భుతస్వాంతులై చూచుచుండ నాకాశమార్గంబున నరిగిరి.

మొదట మంత్రికుమారుఁడగు రాముడు కన్నులిచ్చి పెండ్లి యాడిన పద్మగంధియున్న పట్టణ మరిగి యాతరుణి గూడ రధం బెక్కించుకొని క్రమంబున ననేకదేశములు గడచి పుష్పకారూఢుండగు శ్రీరామచంద్రుఁడువలె భార్యలతో నిష్టాగోష్ఠివిశేషంబుల సంభాషించుకొనుచు నక్కాంతలకుం గల చక్కఁదనంబుల తారతమ్యములఁ దెలిసికొనుచుఁ దాముపడిన యిడుమల నొండొరుల కెరింగించుకొనుచు