పుట:కాశీమజిలీకథలు -01.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

121

యప్పడతికిని సాంబునకును తానును మగండును బెండ్లి పెద్దలై పాణిగ్రహణము సేయించి దీవించిరి.

సాంబుఁ డయ్యంబుజనేత్ర నట్లు స్వీకరించి రెండుమూడుదినంబు లందుండునికుంజగృహంబులఁ గందర్పకేళిని దీర్చి యమ్మానిని దానుఁ దలంచినప్పుడు వచ్చుదానిగా నొడంబరచి యంపిపుచ్చెను. దండుఁడును విద్యుత్ప్రభకును గొంతసంతసము గలుగఁజేసి పైఁగల కార్యాతురత్వంబున సాంతవపూర్వకముగా నిజవాసంబున కంపెను.

పిమ్మట సాంబుఁడును దండుఁడును మిత్రులజాడ దెలియగోరి తొలుత వసంతుఁ డరిగిన యతిదీర్ఘంబగు శాఖామార్గంబునం బడి కొన్నిదినంబులు చనినంత శాఖాంతమున వసంతునికిఁ గనంబడిన వింతలన్నియు వారికినిఁ బొడసూపినవి. వానిం దాటించుచుఁ గ్రమంబున నానిర్జనపురంబును, బురాంతరమున నొప్పుకోటయు నతిగూఢంబగు కోటగుమ్మమును దెలిసికొని యమ్మార్గమున లోని కరిగి యనేకకక్ష్యాంతరములు గడచి తుదకు వసంతుఁడు బరుండియున్న గదిలోని కరిగి యతని జూచిరి. అర్ధనిశ్వాసమారుతములలో సగము బ్రతికియున్న వసంతునిఁ జూచినతోడనే దండుఁడు గుండె ఝల్లుమనఁ బేరెలుంగున వసంతా! వసంతా! అన్నా! వసంత! ఇ ట్లుంటివేమి యని చీరియుఁ బ్రతివచనము వడయక తడబడుచుఁ బర్యంకమున నాలుగుమూలలు వెదకిన నందొకచోఁ దాను మున్నతని ప్రాణంబు లిమిడ్చిన కత్తివర గనబడినఁ గొంతధైర్యముతోఁ గైకొని యది సగ మరగఁదీయబడియుండుటయుఁ జూచి గుండెపై జే యిడుకొని సాంబునితో నిట్లనియె.

సఖా! ఇటు చూడుము. నే నతిగూఢముగా నితనిప్రాణంబు లీవరలో నిమిడ్చితిని. ఆరహస్య మెవరి కెఱింగించెనో కాని వా రతని మోసము జేసి పోయిరి. దైవానుగ్రహమున నట్టిపని కొనసాగినదిగాదు. పాప మీవర మొదలంట నరగదీయలేదు. వీనిఁ బ్రతికించెద జూడుమని యావరయరలన్నియు మరలఁదనయంత్రరచనాపాటవంబు దేటపడునట్లు చక్కఁబరచినతోడనే యావసంతుఁడు నిద్రలేచినట్లు లేచి కన్నులు నులిమికొనుచుఁ గళావతీ! కళావతీ! యన పిలుచుచుఁ గన్నులందెరచి యత్తెరవం గానక నెదుర దన యిరువుర నెయ్యురం గని యంతరంగం బుప్పొంగ వారిం గౌఁగిలించుకొని యోహో! మిత్రులార! నన్ను వనితాలోలుండని యెఱింగియా యిట కరుదెంచితిరి. మీరాక నాకు నీరాకరంబునకు రాకయుంబోలె ముదంబు గూర్చుచున్నయది. రాముండును ప్రవరుండును వచ్చినవారు కారేమి? వారు కుశలముగా నున్నారా?