పుట:కాశీమజిలీకథలు -01.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఇంతలో దండుఁ డాదరి కరిగి తన్నుఁ జూచి సిగ్గుపడుచున్న యక్కన్నియకు నొకపుట్టంబు గట్టనిచ్చి యబలా! యేమి యిది. ఈతనితో జగడము చేయుచున్నదాన వని యడిగిన నది యిట్లనియె.

పుణ్యాత్మా! మాకు మధ్యవర్తివై ఈ తగవు దీర్పుము. నేను పుట్టంబు విడచి గట్టుపైఁబెట్టి జలకేళిఁ దేలుచుండ నీతండు నావలువ సంగ్రహించుకొనివచ్చె. తెచ్చెఁబో నాయది నా కిచ్చి యిచ్చవచ్చినచో నన్నుఁ బెండ్లియాడుమనుచున్నదాన. నే నెన్ని చెప్పినను నా కోక నా కీకున్నవాఁడు. న్యాయమరసి యది నా కిప్పింపు మనుటయు నతండు నవ్వుచుఁ బువ్వుఁబోఁడి! ఈ తగవు నేను తీర్చునదికాదు. మీ యేలికకూఁతురు విద్యుత్ప్రభ తీర్పఁగలదు. దాని నిందు రావించెద జూడుమని యయ్యంగనసు దలంచుకొనినంత నయ్యింతియు నంతికంబున నిలువబడినం జూచి రాగమంజరి వెరగందుచుండ నయ్యండజయానకు దండుఁ డిట్లనియె.

మగువా! ఈ తగవు వివి న్యాయము చెప్పుము. ఈతండు సాంబుఁడని పేరొందిన నా చెలికాఁడు. విద్యాగుణశీలంబుల నాకు జోడగువాఁడు ఇక్కన్యక విద్యాధరకన్యకయఁట. ఇత్తరుణి యిత్తటాకంబున వనకేళిం దేలుచున్నతఱి నీతం డీనాతిచీర దొంగిలించుకొనిపోయెను. అది యిమ్మని యడిగినను నీయక వేడుకమాటలఁ జెప్పుచున్నవాఁడట. వీని యభిప్రాయ మేమియో యెఱుగను. నీవును సూక్ష్మబుద్ధివిగాన వీని చిత్తం బరసి న్యాయము చెప్పుమని పలికిన నచ్చతురుని పలుకులకు నవ్వుచు నవ్వనిత యిట్లనియె.

ఆర్యా! ఈతండు వస్త్రచోరుఁడని మీ మాటలనే తేటయగుచున్నది గదా! తరచు దొంగలకుఁ బూనరాని బరువెత్తి మోయింటయే తగినశిక్షయైయున్నది. కాన నీతని కీనాతి భార మెడతెగక మోయునట్లు శిక్ష విధించితి ననిన నతం డోహో! మేటి చతురవు నీ మాటలు వివాహశబ్దమున కర్థమగుచున్నది. ఈ నాతి నితని వివాహ మాడమంటివా? ఔనౌను. మగవారి కింతకన్న నెక్కుడు శిక్షగలదా? యదార్థము చెప్పితిని. నీ తీరుపుసూటి యబ్బోటి కెఱింగించి యొప్పింపుమనుటయు నా విద్యుత్ప్రభ తన్నుఁ జూచినది మొదలు వెరచియున్న రాగమంజరి నాదరపూర్వకముగా దరికి జేరి మానినీ! వీరు మానవసామాన్యులుగారు. విద్యాగుణశీలంబుల దేవతలగూడఁ దిరస్కరింపనోపుదురు. నే నింతకుము న్నీదండునిం బెండ్లి యాడితిని. తదీయసహకారుండు సాంబుఁడు నంతవాఁ డతని నీవు బెండ్లి చేసుకొని నీసౌందర్యము సార్ధకము గావించుకొనుము. వీరు తలంచినప్పుడ పోయి మన మిరువురము నభీష్టములఁ దీర్చుకొనియెదము గాక యని తత్కాలోచితములగు మాటల నస్పాటలగంధి నొప్పించి యప్పుడ