పుట:కాశీమజిలీకథలు -01.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

119

అయ్యో, సోదరుఁడా! నీ కతయే నీ వెఱుంగక యూరక వెతలఁబడుచుంటివే! అయ్యతివ నీకు మంచి యుపకారమే చేసిపోయినది. విను మది విద్యాధరకన్యక, దాని పేరు రాగమంజరి. దాని చీర నీవు తెచ్చితివని యెఱిఁగి నిన్ను మాయావచనంబుల మరులుగొలిపి రాయిగా శపించి, తనలోకంబున కేగినది. నీ వాయవస్థ నిద్దు రనుకొంటివి. దైవకృపచే నాకుఁ గారణాంతరంబున నీ శాపాంతసూచకములగు పలుకులు వినంబడినవి. దానఁబట్టి నిన్ను దక్కించుకొంటినని తాను మ్రాను వదలి వెళ్ళినది మొదలు మరల నతనితో మాట్లాడుదనుక జరిగిన కథయంతయు నుడివిన వెరఁగుపడి యతం డొక్కింతసేపు విభ్రాంతస్వాంతుఁడై యూరకుండి వెండియు నిట్లనియె.

అన్నా! నీ యదృష్టము కొనియాడఁదగియున్నది. దేవతావనితం బెండ్లి యాడుటయేగాక నన్ను నీ యాపదనుండి దొలఁగించితివి. మఱియు దైవకృప యెట్లున్నదియో కాని నే నెన్నిగతుల మరలింపఁదలఁచుకొన్నను నమ్మగువయందు నాడెందంబు తగులము విడిరాకున్నయది. నన్ను గూడ నీతోటివానిం గావించినఁ గావింపుము. లేనిచో నే నిందు సన్యాసినై క్రుమ్మరియెద. ఇంతకంటె నా మది యొండుగతికి సమ్మతింపకున్నయది. ఈపాటి కార్యము సాధింపుమని వేడుకొనుటయు దండుఁ డిట్లనియె.

సోదరుడా! నీవు దీని కింత వంతఁబడకుము. ఇక్కార్యము సమర్ధించురీతి యా చేడియ లాడుకొనిన మాటలఁ దేటంబడినది . వినుము ప్రతి భానువారంనాఁడు విద్యాధరకన్యక లిందు జలకేళిఁ దేలవచ్చుచుందురు. రేపటిదివసం బట్టిదియే కాన వారు వచ్చి వలువలు విడచి గట్టునం బెట్టి వనకేళిఁ దేలునప్పుడు మునువోలె నీవు రాగమంజరి చీర దెలియకుండ సంగ్రహించి మ్రానుకొమ్మలందున డాగియుండుము. తెలిసికొని యా కుసుమగాత్రి వచ్చి యెన్నిగతుల బ్రతిమాలినను జేరనియ్యకుము. పై కార్యము నేను సమర్థించెదననుటయు నతండు సంతసించి మరునాడు తదాగమనంబున నిరీక్షించుచుండ నయ్యండజయాన లాకసంబుననుండి మెఱపుతీగలో యన దళుక్కురని మెరయు మేనికాంతులు దెసలగ్రమ్మ బుడమికి దిగి యొండొరులు వేడుకఁమాట లాడుకొనుచుఁ బుట్టంబులు గట్టుపయిం బెట్టి జలకేళి దేలుచున్న సమయంబున సాంబుండు మెల్లన నరిగి రాగమంజరి కోక సందిట నిరికించుకొని యరిగి యెప్పటిగతి చెట్టునందు దాగియుండెను.

అక్కొమ్మ లట్లు కొంతసేపు క్రీడించి యత్తటాకంబు వెడలి తమతమచీరలం గట్టుకొని వియద్గతి విద్యాధరలోకంబున కరిగిరి. రాగమంజరి మాత్రము తనచీర గనంబడమి నాత్రపడుచు నందందు వస్త్రాపహారకుని వెదకుచు నెట్టకేలకు నాచెట్టునడుమ నున్న సాంబునిగాంచి యచ్చీర సంగ్రహింప ననేకమాయోపాయములం బన్నెనుగాని యతండు దానిమాటలేమియుఁ బాటింపక చీర నియ్యకయే యుత్తరము చెప్పుచుండెను.