పుట:కాశీమజిలీకథలు -01.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యప్పండతిని గాంధర్వవివాహంబునం గైకొని పైకొనిన మోహముతో నక్కలికి నొక్కపూబొదరింటఁ దుంటవిల్కానిక్రీడల నలయించెను.

అదృష్టవంతుల కెందేగినను లాభమే కలుగును గదా? అట్లు కొన్నిదినము లాయుద్యానవనములో విద్యాధరపల్లవాధరిం గూడి యావేడుకాఁడు కామక్రీడలం దేలుచు నొక్కనాఁడు చెలికాండ్రయుదంత మంతఃకరణగోచరమగుటయు సంతాపాయత్తచిత్తుండై యత్తలోదరితో నిట్లనియె.

కాంతా! నా వృత్తాంతమంతయు నీవు వినియున్నదియేగదా. నా చెలికాండ్రు వటవృక్షమూలమున నాకై వేచియుందురు. మే మేర్పరచుకొనిన మితిదాటినది. పోయివచ్చెద సెలవిమ్మని యడిగిన నతని నుడువుల కెడద నడలు దోప నా పడఁతి యిట్లనియె.

అయ్యో! వేడుక చవిచూసి పోయెదననుట యుచితమా! నాకన్న మిత్రు లెక్కుడువారలా? యెన్నియో క్రొత్తతలంపులు మనంబునఁ బెట్టుకొని సిగ్గుచే బయలు పరుపక కాలము గడుపుచుంటి. పోవలదని నిర్బంధించిన నతం డిట్లనియె. దేవీ! నీవు కామరూపిణివిగదా! నే నెక్కడనుండి తలంచిన నక్కడకు వచ్చి నీ యభీష్టముఁ దీర్చు కొనుము. దీనికింత వలవంతఁ గాంతువేమిటి కనిన నబ్బోఁటియు సమ్మతించినది. పిమ్మట దండుఁ డారెండువిధముల కుసుమములను వేరువేర కోసి మూటగట్టికొని వచ్చినదారింబట్టి నాలుగుదినముల కావటవిటపి మూలము జేరెను.

అందెవరిం గానక చింతాకులస్వాంతుఁడై యోహో! నిరూపించుకొనిన మితియుఁ గడచినది. మిత్రులలో నొక్కరుండైన నిక్కడ జేరలేదు. కారణము దెలియదు సాంబుని చరిత్రము నేను వినినదియె కదా? తొలుత వాని శాపవిమోచనము గావించి వానింగూడి మీదటి కార్యం బాలోచించెదం గాక యని మా విద్యాధరకన్యక చెప్పిన యాకు గురుతుపట్టి యది త్రుంచి జలంబులం గలిపి యందున్న రాలపై జల్లుచున్ తరి నజ్జలస్పర్శము గలిగినంత సాంబుఁ డారూపము విడిచి తొంటియాకృతిఁ గైకొని యెదుటనున్న దండునిం గౌఁగలించుకొని యిట్లనియె.

అన్నా! నీవు వచ్చి యెంత సేపైనది. ఇంకను దక్కిన చెలికాండ్రు రాలేదా? ఇం దొకసుందరి యుండవలె నెందేగెనో యెఱుఁగుదువా? అప్పడఁతి, యిప్పుడు నాయొద్ద మాట్లాడుచున్నదే. ఇంతలో నాకు నిద్దురపట్టినది కాఁబోలు. అయ్యయ్యో ! పాపపునిద్దుర నా కిప్పు డేల రావలయు. అయ్యబలఁ వీక్షించినంగాని మేనఁ బ్రాణంబులు నిలువకున్నవి. వయస్యా! అమ్మదవతిని వెదకితెచ్చి నా కన్నులముందర బెట్టి, ప్రాణదానఫలంబు గట్టికొనుము. అని పెక్కుతెరఁగుల విరహవేదన బలియఁ దన్ను బ్రతిమాలుచున్న సాంబునకు నవ్వుచు దండు డిట్లనియె.