పుట:కాశీమజిలీకథలు -01.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

117

మాయందుఁ బరిపూర్ణముగా నున్నది. లేనిచో నా కీపలుకులు వినఁబడునా! సాంబుడు తొంటిరూపు దాల్చుతెర వెఱుంగఁబడినది. మాకు మంచికాలము వచ్చినది . అని సంతసించుచు నందుండి మరల విద్యుత్ప్రభాభవనమున కరిగి నిజవియోగమునకై కుందు నాసుందరి డెందము కానందము గలుగజేసెను,

విద్యుత్ప్రభ యొకనాఁడు మరల భూలోకోద్యానవనమున విహరింపఁ జిలుకతో వచ్చి యిచ్చవచ్చినతావులఁ గ్రుమ్మరుచు మయునిమాట జ్ఞాపకమువచ్చినతోడనే యా పొదదరి కరిగి తత్కుసుమముల నానవాలు పట్టుచుండ శుకరూపముననున్న దండుఁ డిదియే వేళయని రివ్వున నెగసి యాపువ్వుఁబోఁడి చూచుచుండ నా పచ్చనిపు వ్వాఘ్రాణించునంతఁ దొల్లిటియాకా రమొప్ప ధాత్రి నిలువంబడుటయుఁ గనుంగొని యయ్యంగన వెరగంది యతనితో నిట్లనియె.

ఆర్యా! మీరెవ్వరు? శుకరూప మేమిటికిఁ బూనితిరి? మీ వృత్తాంత మాలింప వేడుక యగుచున్నయది. ఎఱింగింతురే యనుటయు నా యించుఁబోఁడి కతం డిట్లనియె.

నాతీ! నేను మీ తాత మయుని వంశములోని వాఁడనే. నా పేరు దండుఁడు. ఒకానొకకారణమున నీయుద్యానవనమున కరుదెంచి యీపొదరింటిపూ వాఘ్రాణించి యట్టిరూపు గాంచితిని. నా పూర్వపుణ్యవశమున నీ ప్రాపు దొరికినది. మొన్న మీ తాత నుడివిన పలుకులు నాకు వినఁబడినవి కావున నిప్పు డీపుష్ప మాఘ్రాణించి పూర్వపురూప మందితిని. భవదీయదయావిశేషంబున నీ లోకవిశేషములు చూచుటయేకాక, విమానములుచేయు పనిగూడ గ్రహించినాఁడ. నాయందు పరిపూర్ణానుగ్రహ ముంచి సెలవిచ్చినఁ బోయివచ్చెదనని వేడిన నా చేడియ యతని యాకారమునకు, మాటలకు: శీలంబునకు మిగుల మెచ్చుకొనుచు నభిప్రాయసూచకములగు లోచనప్రసారము లతని మొగంబునఁ బరగించుచుఁ గామశరీరపీడితహృదయయై యిట్లనియె.

ఆర్యపుత్రా! నన్నింత నుతింపనేల! నీవు విద్యచేతనేగాక రూపంబునను నసాధారణుండవే. నా పూర్వపుణ్యవశమున నిన్నుఁ బొడగంటి. నీ యట్టి సుందరుఁడు మా విద్యాధరకోటిలో వెదకినను దొరకఁడు. నా మనంబు నీయందు లగ్నమైనది. నన్ను భార్యగా స్వీకరింపుము. మరియు మా తాతయగు మయుం డొకప్పుడు నన్నుఁ జూచి నీకు మానవుఁడు మగఁ డగునని చెప్పియున్నాడు. ఆ సర్వజ్ఞుని మాట దప్పునే! ఇదియునుంగాక నీవును మా కులములోనివాఁడవే యగుట సంబంధమునకుఁ దగియుంటివని చతురోక్తులఁ దన్నాయతివ మిగుల బ్రతిమాలిన సంతసించి యతఁ డప్పుడు