పుట:కాశీమజిలీకథలు -01.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రంబున జలకేళిం దేలితిమికదా! నీవు మాతో రాక యందు జాగుచేసితివేల? అటఁ గ్రొత్త వింతలేమైనం గనంబడినవా యేమి?

రాగమంజరి – అక్కలారా! అక్కడ న న్నొకదానను విడిచి నాచిక్కు లరయక వచ్చితిరి గదా! వినుం డొకమానవుఁ డాచెట్టుచాటున దాగియుండుట మన మెరుగకఁ వలువలు విడిచి జలకేళిఁ దేలితిమి. అప్పుడు చప్పుడుగాకుండ వచ్చి యచ్చనలుఁడు నా వలువను గొని యరిగెను.

చెలి - ఏమేమి? మానవుఁడు వచ్చి నీపుట్టము గొనిపోయెనే. పిమ్మట నేమైనది ?

రాగ – మీరందరు పుట్టంబులఁ గట్టుకొని పయనంపుతొందర నరిగితిరి. నాచీర గనంబడక విభ్రాంతి నొంది నలుదెసలుం బరికింపుచు నే నామఱ్ఱికొమ్మలసందున డాగియున్న యొకచిన్నవానిం జూచి మదీయమాయాపాటవం బంతయుఁ దేటబడ వానిఁ జెట్టు దింపించి యాకోక స్వీకరించి వాని రాయిగా శపించి వచ్చితిని.

చెలి — మేలు, మేలు. వానికి మంచిప్రాయశ్చిత్తముఁ జేసితివి.

రాగ - దైవకృప నాయందుఁ గలుగఁబట్టి వాఁ డాపుట్టము నాకిచ్చెను. లేనిచో నేను వానికి భార్యగా నుండవలసి వచ్చుంజుడీ! దానం జేసియే యాలస్యమైనది.

కుసుమగంధి - హండీ, నీ గుండె యెంత కఠినమే! పాప మతని నెంత కాల మట్లుండ శపించితివి?

రాగ - ఔనౌను. కఠినము గాదా. నీపుట్ట మతఁడు పట్టుకొని వెళ్ళినఁ దెలియును. మరియొకరికి నీతులు చెప్పుట సులభమే!

కుసుమ - శాప మిచ్చి శాపాంతము చెప్పకపోవుట తప్పు గదా.

రాగ - నీకింత వానియందు మక్కువ గలిగినచో నా మఱ్ఱిచెట్టు మొదటనున్న తీగెయాకు జలంబులం గలసి యా రాతిపయి జల్లినచో నతండు మరల పురుషం డగును. అట్లుచేసి యతనిని వరింపుము.

కుసు – నా కట్టి యవసర మేటికి. ధర్మము చెప్పితినిగాని వలచికాదు. ని న్నతఁడు వలచియే నీ వలువను గొనెను గాన నీవే యట్టి పనిచేసి యతనిం బెండ్లి యాడుము. అనుటయు వారి మాటల కందరు పక పక నగి చేతులు తట్టిరి. అట్లు కొంత సేపు జలకేళిందేలి యా రమణు లెల్ల నుల్లంబు లలరఁ దమ తమ నివాసంబుల కరిగిరి.

ఆ మాటలన్నియు విని దండుఁ డోహో! యా మానవుఁడు నా చెలికాఁడగు సాంబుఁడు గావలయు. వానికిఁ బాషాణత్వము ప్రాప్తించెనే కానిమ్ము దై వానుగ్రహము