పుట:కాశీమజిలీకథలు -01.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

115

కరిగి యందాప్తులతో నాచిలుకపలుకులు మచ్చికయుఁ దేటపడ నెరింగించుచు నది యడవిచిలుకవలెఁ బారిపోవునది గాదు గాన దాని స్వేచ్చగాఁ దిరుగ విడిచిపెట్టుచుండును.

విద్యాధరలోకములోఁ దరుచు విమానములు జేయుపని విద్యార్ధులకుఁ బాఠశాలలో నేర్పుచుందురు. చిలుకగానున్న దండుఁడు తన్ను విడిచిపెట్టినప్పుడా పాఠశాలం కరిగి ప్రచ్ఛన్నముగా నుండి సూక్ష్మబుద్ధిగాన నచిరకాలములోనే యాపనిని గ్రహించెను.

ఒకనాఁ డావిద్యుత్ప్రభ తనమాతామహుండైన మయునిఁ జూచుటకు నాచిలుకతో నచ్చటి కరిగి యతనిచే మన్ననలు వడసి కూర్చుండి చిలుకపయినున్న ప్రీతి దేటపడ నతనితో నిట్లనియె.

తాతా! యీ చిలుకం జూచితే ఇది నీవు నాకు విహరింపఁ క్రొత్తగా నిర్మించి యిచ్చిన యుద్యానవనములో దొరికినది. నాకు దీనియందు మక్కువ మిక్కుటము సుమీ! దీనికిని నాయం దట్టి ప్రేముడి గలిగియున్నది. దీనికి బంజర మక్కరలేదు. విడిచివైచినను దాని యిష్టము వచ్చినట్టు తిరిగి పిలిచినంతనే చేరుచుండునని గారాబముగాఁ బలికిన మనుమరాలి పలుకుల కలరి యతం డిట్లనియె.

అమ్మాణీ! చిలుక యనిన జ్ఞాపకము వచ్చినది. నీ యుద్యానవనములోనున్న తటాకంబుదరిఁ దూర్పుదెస నొక పొదరిల్లు గలదు. దాని కుసుమ మెన్నడును నాఘ్రాణింపకుమీ! య ట్లాఘ్రాణించినవారు చిలుక యగుదురు. ఎప్పుడేనిఁ ప్రమాదమున నట్టి పని తటస్థించినచో నా పొదరింటిలోనే వెనుక బాగమున పచ్చరంగుగల యొక కుసుమగుచ్చము గలదు . దాని నాఘ్రాణించిన నట్టిరూపు పోయి తొంటిరూపము వచ్చునని యెరింగించెను. ఆ చిన్నదియు కొన్నిదినంబు లందుండి వెండియుఁ దనలోకముఁ జేరెను.

దండుఁ డామయుని మాటల నాలించి సంతసించుచు దైవకృపకు మెచ్చుకొనుచుఁ దనరూపు మార్చుకొన తెరవు దొరకెనని మురియుచు విద్యాధరకన్యక యావనమున కెప్పుడు పోవునని సమయము నిరీక్షించుచుండెను. మరియు నొకవసంతమున సాయంకాలమున దండుం డప్పురోద్యానవనమునం దగు సహకారతరుశాఖ నధిష్టించి ప్రాంతహాటకతటాకంబున జలకేళిం దేలుచున్న విద్యాధరపల్లవాధరుల సోయగం బరయుచుఁ దదంతికంబున మెలఁగుచుండ నయ్యండజయాన లొండొరులతో సంభాషించుకొను మాట లిట్టు విననయ్యెను.

చెలికత్తెలు — రాగమంజరీ! మన మందరము నిన్నను భూలోకంబున వటస