పుట:కాశీమజిలీకథలు -01.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నుండునేమో చూచిపోయెదంగాక యని నిశ్చయించి యా కొమ్మదిగి యటు నిటు దిరుగుచుండ నొక దండ నందనవనంబునుం బోని యుద్యానవనం బొండు గనంబడినది.

అతం డందులకు వెరఁగందుచు నందు నలుదెసలం బరికింప నొకవంక నలోమణి మణిసోపానములును గాంచనపద్మంబులును సౌవర్ణకువలయంబులును నింద్రనీలరోలంబంబులునుం గలిగి యమృతోపమానంబులగు జలంబులచే నిండింపఁబడిన సరోవరం బొండు నేత్రపర్వము గావించినది. దానిపొంత కరిగి యందలి జలంబుల గ్రోలి దప్పిదీర్చుకొని తత్ప్రాంతమున నున్న లతావితానచ్ఛాయం గొండొకవడి బహువిధకుసుమవాసనల హరించి ప్రసరించు మందమారుతములఁ గతిశ్రమము వాయ విశ్రమించి తదుద్యానవైభవం బరయుచుఁ దాను గూర్చున్న కుంజంబునఁ నొకవింత యగు లతాంతము గానంబడుటయు సంతసముతో నా పూపుఁ ద్రెంచి ముక్కుదరి నిడి తావి నాఘ్రాణించునంతలో నతం డొకచిలుక యయ్యెను.

అట్లు చిలుకరూపు వచ్చినను దొల్లింటి తెలివిగలిగి యుండుటచే నతండు తనలోఁ బలుతెరంగులఁ జింతించుచు నయ్యో! దైవము నన్నిందులకే కాఁబోలు వృక్షశాఖాపదేశంబున గెంటుకొని వచ్చెను. నే నెట్లు పక్షిరూపముతో వసింతు. దీని కవసాన మెట్టి? నన్ను రక్షించువారెవ్వరని యరచుచు నందలి ఫలవృక్షము లెక్కి తత్ఫలరసంబులచే నాకలి యడంచుకొనుచుఁ గొన్ని దినములందుఁ గాలక్షేపము గావించెను.

ఇట్లుండునంత నొకనాఁ డాయుద్యానవనమునకు సోమప్రభ యను విద్యార్థి కూఁతురు విద్యుత్ప్రభ యనునది విహారార్ధము సఖులతో వచ్చి యిచ్చవచ్చి నట్లందంద విహరించుచుండ నయ్యండజయాన నీక్షించి దండుఁడు మెండు వేడుకతో నెగిరి యమ్మగువమ్రోల మృదుమధురములగు పలుకులు వెలయించిన సంతసించి యయ్యించుఁబోడియు దానిం బట్టి గమకించి పయ్యెదపుట్టంబు నడుమునకుఁ జుట్టుకొని మెల్లన యడుగులిడుచు హస్తసంజ్ఞచే సఖుల రొదసేయవలనని వారించుచు నల్లనల్లన దరికరిగినను బెదరక పక్షాంచలంబు లార్చుచు నిలువంబడియున్న యప్పిట్ట నట్టెపట్టుకొని మచ్చిక సేయుటయు నదియు, బెంపుడిదివోలె నమ్మచ్చెకంటి చేయి విడువక పలువేడుకతో నిలువంబడి సరసములగు పలుకులచే నచ్చిలుకలకొలికిని రంజింపఁజేసినది.

అదిమొద లామదవతి యాచిలుకయందు బద్ధానురాగయై తన పలకేలు దానికిఁ బంజరంబయి యుండ నిముశ మేనియు విడువక గారాబముగాఁ బెంచుచుండెను. మరియు దానిం దనకే లెక్కించుకొని వాణియుఁబోలె నాశుకపాణి తనలోకంబున