పుట:కాశీమజిలీకథలు -01.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండుని కథ

113

జయంతుఁడను వానిఁ జిన్ననాటినుండియు వలచియుండ నాతండ్రి వివాహసమయమున నతని కీయమి సూచించిన నా జయంతుడును నేనును విదేశగమనమునకై సాంకేతిక మేర్పరచుకొంటిమి.

ఇంతకన్న నే దోషము నెరుంగను. అతఁ డెట్టి కారణమునో యనుకొనినట్లు రాకపోవుట యెరుంగక మిమ్ము నతడే యనుకొని వెంటఁబడితిని. ఇంతవట్టు నిక్కము దైవముతోడుగా వక్కాణింపగలను. పైన మీరెరిగినదియే గదా యని దైన్యంబున బెక్కుగతులఁ దన్ను బ్రార్థించుచుండ దయాళుండగు ప్రవరుం డామోదించి యాపైదలిం గౌఁగిటంజేర్చి యనునయపూర్వకముగా నిట్లనియె.

కాంతా! నీస్వాంత మన్యథా యున్నదనియే నే నింతకాలము నుపేక్ష చేసితిని. మొన్న నవమానము రాకుండఁ గాపాడిన నీవు చెప్పినట్లు చేయుట నా కుచితమే గదా! నీమతి చమత్కృతియేగాక సౌందర్యముగూడ త్రిలోకమోహాజనకమైయున్నది. అస్వీకృతిదారుఁడనగు నాకు నీయట్టి చేడియం పెండ్లియాడుటకంటె భాగ్యమున్నదియా? దీనికై నన్నింత బ్రతిమాలవలయునా? ఇప్పుడు మంచిముహూర్తము ని న్నిదిగో గాంధర్వవివాహంబున స్వీకరించుచున్నవాఁడ నని యమ్మానవతి మెడలో నొక పూలదండ వైచెను. అమెయు నతనిపై బూవులు జల్లినది. అప్పురుషపుంగవుం డంగకళానైపుణ్యము దేటంబడ నాఁబోటి నారేయి బహువిధరతుల నలయించెను. అయ్యతివయు నా చతురుని రతివిశేషములకు మతిగఱఁగి నానందపారావారవీచికలం దేలెనని యెరింగించునంతలో, బయనంపుతరి యగుటయు నా సన్యాసి కథ చెప్పుట చాలించి యా గొల్లపిల్లవాని కావిడి యెత్తుమని క్రమంబున బైమజిలీ చేరి యందును గాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట నతం డొకరమ్యప్రదేశమున గూర్చుండి శిష్యునకుఁ దదనంతరోదంత మిట్లు చెప్పదొడంగెను.

అయిదవ మజిలీ

దండుని కథ

గోపా! యుత్తరదిశకు వటవిటపిమీఁదుగా నరిగిన కంసాలి కుమారుఁడగు దండునకు నాలుగుదినము లరిగినంతనే యా శాఖాంత మగుపడినది. మగుడఁ దలంచియు మితి చాలయున్నదిగానఁ గారడవిగానున్న యాప్రదేశములో వింతలేమైన