పుట:కాశీమజిలీకథలు -01.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మెరయు రతనంపు పైడితొడవులఁ బెక్కుదాల్చి యొడలనలఁదిన పరిమళద్రవ్యంబుల వాసనలు దెసలావరింపఁ బెంపగు నింపుగులుకు వేషంబునఁ బుడమి జక్కఁదనంబునం బ్రసిద్ధికెక్కిన చక్కెరబోండ్లనెల్లఁ దిరస్కరించుచు నా మేడమీద గద్దియం గూర్చుని నిలువుటద్దంబునఁ దన మేని సోయగంబెల్ల నుల్లంబలర నీక్షించుకొనుచు నా వృద్ధం జీరి యిట్లనియె.

అవ్వా! నే నొక్కసారి జీరుచుంటినని చెప్పి యప్ప్రవరు నిచ్చటికిం దోడ్కొని రమ్మని పనిచిన నామెయు జని యతనితో నామాట చెప్పినది. అతండు శంకాన్వితస్వాంతుఁడై కారణం బడిగి రమ్మని మరల నామె ననచిన నా యవ్వయు నా జవ్వని వలన బోధింపబడి మరల నరిగి యతని కిట్లనియె.

ఆర్యా! మొన్న సముద్రస్నానము చేయునప్పుడు కాలిలోఁ జేపముల్లు గ్రుచ్చుకొనెనఁట. అది తీయజాలినవా రెవ్వరును లేకపోయిరి. నీకు శక్యమగునని యూహించియే పిలువమన్నదని పలికిన నులికిపడి యతం డయ్యో! పాప ముపకారమునకై వచ్చిన యచ్చేడియ ముల్లువిరిగి బాధపడుచున్నదియా! యింతదాక నేమిటికి జెప్పినది కాదు. అని పలుకుచు ముల్లుతీయు సాధనమొదటి చేతంబూని యతిజవంబున నావృద్ధవెంట నా వాల్గంటియున్న మందిరమున కరిగి యొక్కింత తలవాల్చి యో సాధ్వీ! నీ కాలిలో ముల్లెక్కడ విరిగినదియో చెప్పుము. దీసెద ననుటయు నల్లన నవ్వుచు నా శుకవాణి యిట్లనియె.

ఆర్యా! ముల్లు దీయవచ్చి యింత తొందరపడియెద రేమిటికి? అది నిదానింపక తీసినచో నొప్పియగుం గదా! యీ పీఠమునం దొకింత విశ్రమించి ముంటిజాడ దెలిసికొనుడు అనిన నతం డట్లే యని యామెచే నియ్యబడిన బీఠమునం గూర్చుండెను. పిమ్మట నాచతుర చిరునగవు మొగము నలంకరింప దట్టంపుచూపు లతనిపై బరగించుచు నిట్లనియె.

మహాత్మా! ఆపత్సముద్రనం బడద్రోసిన భగవంతుడే నాకు మీ రను తెప్పం జూపించెను. హస్తగతంబగు మణిని గాజుపూసయని యుపేక్షించితిని. అల్లనాడు గుఱ్ఱముమీఁద జూచినప్పుడు కట్టుకొనిన పుట్టములంబట్టి మిమ్ము సామాన్యులనుకొనియే యింతదనుక నుపేక్షచేసితిని. మీ రూపమేకాక విద్యాగుణశీలంబులు ననన్యసామాన్యములై యొప్పుచున్నవి. ఇట్టి మీ ప్రాపుదొరికినను ననాథవలె నే నీపరువమంతయు గాలముపాలు చేయుచున్నదాన నింతకన్న నవివేకమున్నదియా? దీనురాలనై వేడుకొనియెద. నన్ను గాంధర్వవివాహంబున స్వీకరించి కులం బుద్ధరించుకొనుఁడు. ఒకవేళ నన్ను దుష్టురాలినిగాఁ దలంచెదరేమో వినుండు. నేను రాజకుమార్తెను. నా పేరు కాంచనవల్లి. నేను సమవయస్కుండును సహాధ్యాయుఁడునగు మా మంత్రికుమారుఁడు