పుట:కాశీమజిలీకథలు -01.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

111

రాజు ఆ విశేషము భార్యతోజెప్పి మన మంత్రిపుంగవుఁడు శ్రీకృష్ణునికన్న విలాసపురుషుఁడట. ఎనమండ్రు భార్యలు దేవకాంతలు గాని మనుష్యకాంతలు కారట. అతని కీ యదృష్ట మెట్లు పట్టినదో యని వెరగుపడుచుఁ బరితపించుచుండెను .

ప్రవరుఁడు రాజనందన చేసిన చమత్కారమునకు మిగుల మెచ్చుకొనుచు నయ్యుపకారమునకు బ్రతి యెద్దియొఁ దాను జేయలేనని యవ్వనిత వినుచుండ నవ్వతోఁ గృతజ్ఞతాసూచకములగు స్తుతులు పెక్కుచేసెను. అక్కన్యయు మనంబున నిట్లు వితర్కించెను.

అక్కటా! నా జవ్వనమంతయు నడవిఁగాసెడు వెన్నెలవలె వ్యర్ధమగుచున్నది! మంత్రికుమారుఁడగు జయంతుని విడదీసి ప్రతికూలుఁడైన దైవమిప్పుడు సానుకూలుఁ డగుచున్నట్లు తోచుచున్నది. మొదట నీతని మొగము నిదానించి చూడమి నిన్నా ళ్ళుపేక్షించి యూరక కుందుచుంటిని. పరిశీలించినచో నితం డతనికన్న జక్కనివాఁడును విద్వాంసుఁడు నగుటచే నా కింత చింతించవలసిన యవసరమే లేకపోవును. చక్కదనమేకాక యీ పురుషశ్రేష్ఠుని జితేంద్రియత్వము మిగుల శ్లాఘాపాత్రమై యున్నది. ఇంత సొగసుగల నెలంత యూరక తన యాధీనమం దుండ మఱియొకం డెవడైన నిట్లుపేక్ష జేయునా ? ఆ సుగుణనంపత్తియే వీని యదృష్టమునకుఁ గారణమని యూహించెద. నే నిఁక నితని వివాహమాడనిచో నా చక్కదనమునకు దిక్కేది? నేఁడు నాకు శుభశుభసూచకముగా నెడమభుజ మదురుచున్నది. ఈ రేయి వీనితోఁ గలసి కొంత ముచ్చటించెదఁగాక యని నిశ్చయింలి యా రాత్రి ప్రవరునికి వడ్డించునప్పు డవ్వతోఁ బూర్వముకన్న నెక్కుడుగా పదార్థములు వడ్డించుమని రహస్యముగా బోధించినది.

వృద్ధయు నమ్ముద్దులగుమ్మ చెప్పినచొప్పున నెక్కుడుగా వడ్డించినం జూచి ప్రవరు డవ్వా! నా కీదినంబున నిట్లు వడ్డించితివేమి? నా భోజనపుతీరు మరచితివా? నా కడుపు పెద్దదియైన దనుకొంటివా? యని యడిగిన దలుపుదాటున నున్న యన్నాతి యతఁడు వినుచుండ నిట్లనియె

అవ్వా! పదార్థము లెక్కుడైనచో దిగఁబెట్టవచ్చును. వంటజేయుటకును సరిగంగాస్నానము లాడుటకును నొడంబడినవారు పదార్థశేషములు దినుటకు మాత్ర మర్హులుగారా? అవసరం బున్న యప్పుడేగాని యాశ్రితజనంబుల మన్నింపరు గాఁబోలు నని యుత్తరము చెప్పిన నతం డా మాట కేమియుఁ బలుకక వలయునంత భుజించి యెప్పటియట్ల తన శయ్యాగృహంబున కరిగి పండుకొనియె.

పిమ్మట నా కొమ్మయు నాఁడు కాంతుని పాత్రయందు భుజియించి యంతఃపురంబంతయు వింతగా సింగారించి మించుతళ్కులఁ దిరస్కరించు మేనికాంతుల