పుట:కాశీమజిలీకథలు -01.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అవ్వ యందు గూర్చుండి యాదాదికి దగినమర్యాద గావించినది. అప్పు డాదాది అమ్మా! మంత్రిగారి భార్య లేరీ! వారి కీకానుక లీయవలయు. నెందఱు? వారిపేరు లేమో మీ రెఱుంగుదురా వ్రాసికొనవలయునని యడిగిన నా యవ్వ మంత్రిగారికి నెనమండ్రు భార్యలున్నారు. వారిభార్యలపేరులు శ్రీకృష్ణుని భార్యలపేరులే. వారందరు కలసి యేకముగా రారు. ఒకరితో నొకరు మాటాడరు. సాపత్నీధర్మము లోకవిదితమే కదా? ఎవ్వరిని పిలువమన్న వారిని నేను తీసుకొనివచ్చెదఁ జెప్పుమనుటయు నా దాది మొన్న సముద్రస్నానమునకు వచ్చినవా రేడ్వురే కదా యని యేడుచీరలే తెచ్చితిని. కానిండు మఱియొకటి నింతలోఁ దెప్పించెద ముందుగాఁ బెద్దభార్యం బిలువుడని పలికిన విని యా యవ్వ మొన్న కడపటియామెకు దేహములో స్వస్థతలేక సముద్రస్నానమునకు రాలేదు. మంత్రిగారి కెనమండుగురు భార్యలు అని చెప్పుచు నా యవ్వ లోపలకుఁ బోయి దివ్యాలంకారభూషితయై యొకదినుసు నగలును వలువలును ధరించి మెఱయుచున్న యాయన్నులమిన్నను వెంటబెట్టుకొనివచ్చి యీమెయే పెద్దభార్య. ఈమె పేరు రుక్మిణి. ఈమె సంగీతములో నిధి అని యామె గుణంబును వర్ణించి చెప్పినది.

దాది యామెకు నమస్కరించి కొంతప్రసంగము గావించి యామె పలుకుల కలరుచు దాను దెచ్చిన కానుక లిచ్చి రెండవయామెను దీసికొనిరమ్మని ముసలమ్మకు సంజ్ఞఁ జేసినది. అప్పు డాయవ్వ యవ్వనితను లోపలకుఁ దీసికొనిపోయి ముహూర్త కాలములో మఱియొక దినుసునగలు వలువలుదాల్చి మఱియొకతెవలె దోచుచున్న యా చిన్నదాని కైదండ పట్టుకొని తీసికొనివచ్చి దానికి జూపుచు నీమె రెండవభార్య. ఈమె పేరు సత్యభామ ఈమెకుఁ దర్కవ్యాకరణములు రెండును గూలంకషముగాఁ దెలియునని చెప్పినది.

ఆ దాది యామెతోఁ గొంత ముచ్చటించి సంతసించుచుఁ గానుక లిచ్చి మూడవయామెం దీసికొనిరమ్మని సంజ్ఞ జేయుటయు వృద్ధ యమ్ముద్దియను లోపలకుఁ దీసికొని పోయి మరియొకవేషముతోఁ దీసికొనివచ్చి చూపినది . ఈరీతిగా నానాతి యెనమండ్రు జవరాండ్రగా తోచునట్లు వేషములుమార్చి వలువలు తొడవులు చాయలుగూడ నెనిమిదిదినుసులుగా ధరించి దానితో సంభాషించునప్పుడు స్వరభేదములు గలుగునట్లుచేసి దానిని మోహింపఁజేసినది.

ఆ దాదియు నెనమండ్రు భార్యలకుఁ గానుక లిచ్చి వారివారినామవిద్యారూపవిశేషములు వ్రాసికొని వారివలన నామంత్రణము వడసి రాజునొద్దకుఁ తచ్చాతుర్యాదివిశేషంబులు నద్భుతముగా స్తుతిజేయఁదొడంగినది.