పుట:కాశీమజిలీకథలు -01.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

109

బ్రవేశబెట్టిరి. అప్పుడు రాజును భార్యయు జూచుచుండ నయ్యండజయాన మొదటి గుడారమునుండి వచ్చి ప్రవరునితో స్నానము జేసి పోయి యాడేరాలోనుండి రెండవదానిలోనికి వచ్చి యందున్న నగలను వలువను ధరించి యప్పటియట్ల యరిగి యత్తరుణి ప్రవరునితో స్నానము జేసెను. ఈ రీతిని నగలును జీరలును మార్చుచు నచ్చేడియ నేడుగుడారములలో నుండి వచ్చి వచ్చి ప్రవరునితో సరిగంగాస్నానములు చేసినది.

ఆ వింతయంతయు జూచి కందర్పకేతుండును భార్యయు మనంబున మిగుల వెరగుపడి యోహో! మొదట మన ప్రధానికి నొకతయే భార్యయని వింటిమి. విమర్శింప నిద్దరు దోచిరి. ఇప్పుడు జూడ నేడ్గురుగా గాన్పించిరి. వీరి చక్కదన మొక్కరీతిగా నుస్నది. ఈతని కిందఱు సుందరులున్న సంగతియే తెలియదు. వీరి యైకమత్యమే యీగుట్టునకు మూలమని యనేకరీతుల నాదాంపత్యమును గురించి చెప్పుకొనుచు మరల నాందోళికము లెక్కి యింటి కరిగిరి. ప్రవరుడును రాజపుత్రికయు నెప్పటియట్ల గొప్పవైభవముతో బస జేరిరి. జానలగు మానినులు పన్ను కార్యములకు బ్రతిహతము గలదా?

ఆమరునాడు రాజు తెలివిగల యొకపరిచారికం జీరి యేడుజల్తారుచీరలతో మఱికొన్నికానుక లుంచి వీని దీసికొనిపోయి మంత్రిగారి భార్యల కిచ్చి వారివారిపేరుల వ్రాసికొని రమ్ము. వా రేమి విద్యలం జదివిరో తెలిసికొని రమ్మని మరికొన్ని మాటలం బోధించి యంపెను.

ఆపనికత్తెయు నాకానుకల బట్టించుకొని మంత్రిగారి ద్వారము నొద్దకుబోయి తనరాకయు రాజుగారి సందేశప్రకారము దెలియజేయుటయు బ్రవరుడు గుండె ఝల్లుమన నయ్యో! ఈరాజు నాగుట్టు దెలిసికొనువఱకు విడుచునట్లులేదు. ఆ చిన్నదియు నతనికి బైయెత్తు వైచుచు భ్రమపెట్టుచున్నది. ఇప్పు డేమి చేయగలను. ఏడ్వురుభార్యలకు నేడుజల్తారుమేల్కట్టుచీరలు పంపించియున్నాడు. ఏడ్వురు గనబడి కానుక లందికొని పేరులు చెప్పవలయునట. ఏమి చేయుదును దైవమా! అని ధ్యానించుచు నా ముద్దియ నాకన్న బుద్ధిమంతురాలు. దీని కేమి వ్యూహము బన్నునో చూచెదంగాక యని తలంచి యప్పుడే యా వృత్తాంతము అవ్వతో చెప్పి యాయొప్పులకుప్పకు దెలియజేసెను.

అప్పుడా ప్రజ్ఞావతి అవ్వా! ఇందులకు వెరవబనిలేదు. ఆ దాదిని గానుకలతో రమ్మనవచ్చును. సరిగంగస్నానములు జేసినవారు జీరలందుకొనరా? సందియ మవసరము లేదనిచెప్పి తరువాత ముసలమ్మకు గొన్నిమాటలు బోధించి చేయవలసిన యుపాయ మెఱింగించి తాను లోపలకు బోయినది.

ప్రపరుడు తనపరిచారికవెంట రాజదాసిని తనయంతఃపురమున కనిపెను.