పుట:కాశీమజిలీకథలు -01.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

105

పోటిగంటుమంట వాల్గంటికింబలె రహస్యమైయున్నదిగదా! యని యనేకగతుల చమత్కృతి వచనంబు లాడుచు భార్యతో బోటీ! ఘృతాపూపంబుల నిటు తీసుకొనిరా. ఇతనికి వడ్డింపుమనిన నతండు వలదని చేయిద్రిప్పిన నిర్బందించుచు తన్వీ నాకంత పూర్తిగా వడ్డింపకుము. రేపు నాకు మంత్రిగారి యింట్లో విందు జరుగబోవును. మా మంత్రి భార్య పదార్ధములు నీకంటె రుచిగా జేయగలదట. బ్రాహ్మణులకు రుచి తెలిసినట్లు భోజనమం దితరులకు తెలియదు. లోకంబున మైత్రియు బాంధవ్యంబును భోజనంబునం గాని లెస్సగా గలియవు. అని యభిప్రాయసూచకముగా సంభాషించు రాజు మాటలన్నియు విని ప్రవరుడు గుండె పగుల దిగులుపడి వేతెరంగుల నంతరంగమున జింతించుచుండెను.

భోజనమైన వెనుక సభామండపమున వారాంగనానృత్యగానవినోదంబుల గొంత గడపి యా రేడు ప్రగ్గడకు గర్పూరవీటీప్రముఖములగు పెక్కుసత్కారంబు లాచరించిన నవి యన్నియు నాదరపూర్వకముగా స్వీకరించి లేవబోవునప్పుడు మంత్రి రాజుతో నిట్లనియె.

దేవా! మేము దినునది యంతయు దేవరసొమ్ము. ఐనను మా భక్తివిశ్వాసము లిట్లు బ్రేరేపించుచున్నవి. తమ రిందాక నాడిన మాట యదార్థము సేయ వేడెదను. ఆర్యులు పరిహాసంబుల సయిత మసత్యము దొలుకనీయరుగదా? దేవరగూడ రేపు మా యింటికి విందునకు దయచేసి గృహపావనము సేయ ప్రార్థించుచున్నవాడ ననిన నవ్వుచు నతం డిట్లనియె.

మిత్రమా! దీనికై నన్నింత ప్రార్థింపవలయునా? విందు లనిన నాకు మిగులసంతసమను విషయము నీ వెరుగవు కాబోలు. ఆలాగుననే వచ్చెద. వంటమాత్రము పెందలకడ జేయింపుమని యాదరపూర్వకముగా సాగనంపిన నతండును రానిసంతోషము మొగమునకు దెచ్చుకొనుచునతని వీడ్కొని యింటికరిగెను. అట్లరిగి పర్యంకము మీద బరుండి యిట్లు ధ్యానించెను.

అయ్యో! నా కప్పటికి రాజును విందునకు బిలువక తీరినదికాదు. వంట జేయ నాకు భార్యలేదు గదా! రాజు భార్యచే వంట జేయించి వడ్డింపించి నప్పుడు నే నొరులచే వంట జేయించుట యుచితముగాదు. అదియుంగాక రమణీప్రియుండగు రాజు చేసిన కపటము బొడగట్టినది. నా యింటనున్న యీవాల్గంటివృత్తాంత మెవ్వరివలననో విని యిది నా భార్యయే యనుకొని దీనిం జూచుటకే యిట్టి ప్రయత్నమును జేసెను.

ఈ కాంత యెవ్వతయో నాకును దెలియదు. తా నెవ్వరినో వలచి సాంకేతిక మేర్పరచికొని నన్నే యతడనుకొని మోసపోయినది. పాపము సంతతము వానికొరకే