పుట:కాశీమజిలీకథలు -01.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మనోహరా! ఈ రైక మీ ప్రధానిగారి భార్యదని యీ చాకెత చెప్పినది. ఆమె చక్కదనము గుఱించి యీ రజకాంగన యూరక పొగడుచున్నది. ఇట్టి మూఢురాలినే వెరగుపరచిన యా తరుణీమణి సోయగము దర్శనీయమని తెల్లమగుచున్నది అని యెరిగించుటయు నా భూపతి యాశ్చర్యవస్థావేశితమతియై యేమి! ప్రవరుని భార్య యింత చక్కనిదియా! అతండు ప్రధానియైన పిమ్మట వివాహమాడియుండలేదు. అంతకుముందు సామాన్యస్థితి కలవాడని వింటిమి. అప్పు డట్టి యెలనాగ యెట్లు దొరకును. బ్రాహ్మణులలో రూపవంతులుండుట యరుదందురు. ఈ సందేహము తీర్చుకొనవలసినదే యని పలికెను.

అప్పుడా రాజపత్ని నవ్వుచు చేపకడుపున రత్నవలయము దొరకినతోడనే దానిం ధరించు మించుబోడిని సముద్రాంతము నుండి రప్పించితివి. ఇప్పు డీ రైక ధరించు కోకస్తనని జూడక విడుదురా! యని పరిహాసమాడినది. ఆ నృపతియు కాంతా! వింతవస్తువులం జూడ నెవ్వనికి వేడుకయుండదు? చూచినంతనే తప్పు వచ్చునా? ప్రవరుని భార్యంజూచు నుపాయ మొకం డూహించితిని. రేపు నీవు స్వయముగా వంటజేయుము మన యింటి కతని విందునకు బిలచెదనని చేయదగిన కృత్యము లన్నియు బోధించి యతం డప్పుడ యాస్థానమున కరిగెను.

అంతకుబూర్వమే కొల్వుకూట మలంకరించిన ప్రవరునితో గూడుకొని రాజకార్యముల విమర్శించి యనంతర మా నృపాలుం డతనితో నిట్లనియె. సుమతిప్రపరా! మన మిరువర మొకచోట భుజింపవలయునని యెన్నియో దినములనుండి వేడుకగలిగి యున్నది. రేపు మా యింట భుజించి నా యభిలాష దీర్పుము. మిత్రయుక్తముగా భుజించు దివసమే పండుగయని జెప్పుదురు. నీవు మా కన్నిగతుల బూజ్యుడవని సాదరముగా నుడివిన విని ప్రవరుండు సంతోష మభినయించుచు దేవా! మేమునిత్యము మీ యన్నమే భుజించుచున్నారము. అది యట్లుండె మీసహపంక్తిని భుజించుటకన్న గౌరవ మున్నదియా? మీరు నన్నింత పెద్ద చేసి మన్నించిరి. రేపు నాకు సుదినమని ప్రవరుడు స్తోత్రముజేయుచు నా విందున కనుమోదించెను.

కందర్పకేతుడును నమ్మరునాడు ప్రవరుని దన యింటికి దోడుకొనివచ్చి యంతఃపురములో భార్య వడ్డింప నామంత్రితో నిష్ఠగోష్ఠి వినోదాలాపములతో భుజించుచుండెను.

దీర్ఘ దర్శియగు నా ప్రవరుడును భుజించునప్పు డెద్దియో విచారము మనంబున నంకురింప దలవాల్చుకొనియే చింతించుచుండెను. అప్పు డయ్యొడయండు ఆర్యా ! ఈ ఫలమెంత రసవంతముగా నున్నదియో చూచితివా? ఈ శాకము రుచిగా జేయబడినది సుమీ! ఈ పాయసంబున వైచిన మిరియపుపొడి కారము, ప్రియుని మునుపంటి