పుట:కాశీమజిలీకథలు -01.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

103

బెక్కండ్ర దూతలం బుచ్చెను. పిమ్మట నొక సత్రకుడ్యమ్మున దనరూపు చిత్తరువును వ్రాయించి వేలగట్టి దానిని సాభిప్రాయముగా జూచినవారి దనయొద్దకు బట్టితెండని తగినకింకరుల నియోగించెను.

ఇట్లుండ నంత నొక్కనాడు మంత్రిగారి యింటికి బిశునమతి యను చాకలిది వచ్చి యుదుకుటకు బట్టలు వేయుడని యడిగిన రాజపుత్రియుం బారాయత్తచిత్తయై యున్నకతంబున బరిశీలింపక కొన్నిబట్టలతో దొడిగిన రైక యప్పుడ విప్పివైచిన ననియన్నియు మూటగట్టుకొని యది యామె సోయగమున కచ్చెరువందుచు నామూట మోసికొని రాజుగారి యింటి కరిగి యా చాకలిది మాసిన పుట్టములు వేయుడని యడిగినది. రాజపత్ని యంతకుముందు దెచ్చిన బట్ట లెవ్వరివని యడిగిన అమ్మా! ఇవి మంత్రిగారి బట్టలు. వారి యింటిపనిగూడ మేము చేయుచున్నవారము అని చెప్పుటయు రాజపత్ని ఓసీ! మంత్రిభార్య యేపాటి చక్కనిది? ప్రాయమెంత? గుణమెట్టిదని యడిగిన నా రాజకాంత కా యంగన నవ్వుచు నిట్లనియె

దేవీ! మంత్రిగారి భార్యవంటి యందకత్తె నింతకుముందు నే నెందును జూచి యుండలేదు. నిజము చెప్పిన మీకు గోపము వచ్చునేమో! మీరుగూడ నామెకు జాలరు. ఆమె యెప్పుడును విచారించుచు నొకచోట గూర్చుండును. వారియింట నొకముసలామె యున్నది. మంత్రిగారి భార్య వయసుబింక మెట్లున్నదియో యీ రైకయే చెప్పుచున్నది చూడుడు. విప్పివైచినను దొడిగినట్లేయున్నది. మేనిపొంకము బింకమంతయు నిట్లేయున్నది. అని యూరక పొగడుటయు నా రాజు భార్యయు నా చిహ్నములు జూచి వెరగుపడుచు నిట్లనియె.

ఓసీ! మా ప్రధాని మొదట యాచకుడుగా గుటుంబముతో నీయూరు వచ్చి తన విద్యామహిమచే బ్రధానపదవి సంపాదించుకొనియెనని వింటిని. సామాన్యస్థితియం దింత చక్కని భార్య యెట్లు లభించినది. ఇది కడువింతయే యని యా రైక గైకొని విమర్శించుచుండ నింతలో నొడయం డెద్దియో పనిమీద నక్కడికి వచ్చి భార్యచేత రైకజూచి యిది యెవ్వరిది? దీని నిట్లు పరీక్షించుచుంటివేమి అని యడిగిన భర్తం జూచి నవ్వుచు నా పువ్వుబోటి యిట్లనియె.

ప్రాణేశ్వరా! ఈ కంచుళి యెవ్వరిదో చెప్పుకొనుడు. దీనిం దొడుగు పడతి యెంతవయసు గలదియో యూహింపుడని పరిహాసముగా నడిగిన నా నృపతి పరీక్షించి ఆమెతో నిట్లనియె. ఆహా! వీనిం ధరించు మించుబోడి బింకమంతయు నిది చాటించుచున్నది. ఎన్ని మడతలుబెట్టి నలిపి విడిచినను గుబ్బవడువున నిలంబడుచున్నది. దీనిం ధరించు మించుబోడి వయసును సొగసును విస్మయజనములని తోచుచున్నవి. ఇది యెవ్వతెదో యెఱిగింపుమని యుత్సుకుడై యడిగిన నా వధూటి నిట్లనియె.