పుట:కాశీమజిలీకథలు -01.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మేము గాఢనిద్రాపరవశులమైయుండ నా ప్రియుని స్మృతి తప్పించి నన్నోడమీద నీ నగరము జేర్చి యీ రాజున కప్పగించినది.

ఇతండును, కందర్పజ్వరపీడితుండై యాతురంబున నన్ను ముట్టవచ్చిన వ్రతకైతవంబున నొకవత్సరంబు మితిగోరితిని. అదియు సమీపించుచున్నది. దైవము నన్నేమి సేయదలంచెనో యెరుగను. బంధుదర్శనంబునంబోలె మిమ్ము జూడ నా కానంద ముదయించుచున్నది. మీ వట్టి ధర్మాత్ములకు దీనులయెడ మీ యెడద బొడమిన కరుణ బెంపుజేయ భగవంతుని మిక్కిలి ప్రార్ధించెదను. నా వృత్తాంతం బిదియ. నా మనోహరు నరసి దెప్పించెద నంటిరి. అట్టిమాట పాటికిఁ దెచ్చి నా యాపదల దొలగింపుడని మిక్కిలి వేడుకొనియెను.

ఆమె వృత్తాంతమంతము విని యతండు మేను ఝల్లుమన హా వసంతా! హా రామా! హా సాంబా! హా దండుడా! మీ మాట మరిచిపోయి, యిం దితరవ్యాపారాసక్తుండనై యుంటి మిత్రముండన నేను కానా? అయ్యో! మిమ్ముజూచి యెంతకాల మయినది. తరుమూలము జేరి నా కొరకు నిరీక్షించి విసిసి యెందేని బోయితిరా? కట కటా! వసంతుని వృత్తాంత మీ యింతి మాటలం దెలిసినది. నావలెనే యతండును సుఖసక్తుండై మిత్రులమాట మరచి వృక్షమూలము చేరలేదు. మఱియు నావృద్ధాంగనవలన మోసపోయెనే యని యనేక ప్రకారముల విచారించుచు తనవృత్తాంతమంతయు నానాతి కెఱింగించిన నయ్యించుబోడి మోమంత యెత్తి సంతోషముతో నతని కిట్లనియె.

ఆర్యా! మీయన్న వసంతుడు నాతో బలుమారు మీచరిత్ర లుగ్గడించి చెప్పెను. నీవు మిగుల సాధుబుద్ధివి. నా పురాకృతసుకృత మెద్దియో యించుక బయల్పడినది. లేకున్న నిట్టి యాపద్సమయంబున బంధుదర్శనం బగునా యిక నీయన్నజాడ నరయుచు న న్నీయిడుములనుండి తొలగించుటకు నీదే భారము. నీకు బెక్కులు చెప్పనక్కరలేదు. అని తత్సమయోచితములగు మాటలనే నతనికి సంతోషమును విచారమును గలుగజేసినది.

ఆమె పలుకులకు వెరగుపడుచు ప్రవరుండు సాధ్వీ! నీవు చింతింపకుము. నే నిన్ను గాపాడుదు నిందుండియే మిత్రుల వెదకించి యిందు రప్పించెదసు. మానవులకు గోరక దుఃఖములెట్లు వచ్చునో కాలక్రమంబున సౌఖ్యములుగూడ నట్లే ప్రాప్తించును. రెండును దైవాధీనములే యని యనేక నీతివాక్యములచే నామె నోదార్చి వీడ్కొని యతండు రాజునొద్ద కరిగి యతనితో నయ్యా ! యయ్యతివ యింకను వ్రతపరాధీనమైయున్నది గాన మౌనంబుగా నున్నది. ముందాలోచింతము గాక యని యతని నప్పటికి సమాధానపరచి యింటి కరిగి వారి జాడ నరయ నలుదిక్కులకు