పుట:కాశీమజిలీకథలు -01.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

101

కొనని రహస్యము లుండవుగదా! విను మేను ద్రిభువనాశ్చర్యకరూపంబున దొలుపొందు నిందుముఖి నొకదాని ద్వీపాంతరమునుండి రప్పించితిని. ఎన్ని జెప్పినను నప్పడంతి నాకు వశవర్తినిగాక సర్వదా దఃఖించుచున్నది. అత్తలోదరి నిమిత్తముగా జిత్తభవుడు నా చిత్తము దుత్తునియలు గావింపుచున్నవాడు. ధర్మాధర్మవివేచము విడిచి రేయింబవలు నే నాకనకాంగి నవకంబు దలంచుకొనుచు జివుకుచుంటిని మరియు-

ఉ॥ "ఒకొక్కవేళ బద్మములు ● లొల్లమి సేయుదు రొక్కవేళ దె
      న్మక్కువ నాదరింతురు క్ష ● ణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్
      పక్కున వేసరంజనదు ● పాయములం దగు నిచ్చకంబులం
      జిక్కగజేసి డాసి సతి ● చిత్తముబట్టి సుఖింపగాదగున్."

అని వ్రాసిన కవివాక్యము ననుసరించి కాలయాపన సేయుచుంటిని. బలవంతము సేయుటకు నుల్ల మొల్లకున్నది. ఆక్కాంతారత్నము తనంతవచ్చి నన్గలసికొనునట్లు సేయుదువేని నీ బుద్దిబలంబునకు సాధ్యముకానిది లేదని స్తోత్రపూర్వకముగా నా చిన్నదానివృత్తాంతము చెప్పిన విని యయ్యధర్మమునకు మిగుల బరితపించుచు సమయజ్ఞుండగు యతం డప్పటి కేమియు ననక యొకనా డచ్చేడియమేడ కరిగి యధోముఖియై ద్యానించుచున్న యమ్మించుబోటి నోదార్చి యల్లన నిట్లనియె.

సాధ్వీ! నేను గ్రొత్తగా వచ్చిన మంత్రిని. నీవృత్తాంత మంతయును విని జాలిపడియు నిప్పు డేమియు జేయునదిలేక యూరకుంటిని. సమయము వచ్చినప్పుడు నా యోపినంత యుపకారము సేసెద. దుర్మార్గుడైన రాజు నన్నిప్పుడు నీ చిత్తవృత్తి యరసిరమ్మని పంపెను. నా బుద్ధి యధర్మమునందు బ్రవేశించునది కాదు. నీ మగని కులశీలనామంబుల జెప్పుము. వాని బట్టి తేరనియోగింతునని పలికిన యతని చల్లనిమాటలు హృదయసంతాపంబు కొంతవాయ మొగ మొకయింత యెత్తి యమ్మత్తకాశిని యిట్లనియె.

అన్నా! నీమతి వివేకము వచనగౌరవమే చెప్పుచున్నది. నీ వంటి పరోపకారపారీణులు కొంద రుండబట్టి గదా వసుంధరతిరంబై యున్నది. నా పేరు కళావతి. నా మగండు కాశ్మీరదేశ రాజకుమారుడు. వసంతుడను స్వార్ధకాహ్వాయముగల యాపురుషరత్నము నలుగురుమిత్రులతో విదేశదర్శనార్ధమై దేశము వదలి యందంద సంచరించుచు నొకవటవృక్షమూలమున దనచెలికాండ్రతో వియోగము నొంది రాక్షసనగముల నేకాంతముగానున్న నన్ను గాంధర్వవిధి బెండ్లి యాడి యందు స్వర్గసౌఖ్యంబు లనుభవింపుచుండ నొకనా డొకముసలిది వచ్చి కొన్ని దినములు మిగుల నమ్మకముగా మా నడుమ నుండి నా మగని యాయువు మర్మము నాచేత నడిగించి తెలిసికొని