పుట:కాశీమజిలీకథలు -01.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దేవా! ఇది యదార్థపురత్న మైనచో రెండుకోట్లరూపికలు వెలజేయును గాని గాజురాయి యగుటచే నొకరూప్యమైన జేయదు. దాని యందమునుబట్టి ఇచ్చినచో నొక రూపిక నియ్యవచ్చునని నిర్భయముగా జెప్పెను. ఆ మాట విని యా రత్నవర్తకుడు లోన దిగులొందియు నా దైన్యము మొగమునం దోపనీయక, యోహో! మంచి నాణెగాడవౌదువు. ఈలాటివారు పదుగురున్నచో మా వర్తకము బాగుగనే సాగును. చాలు చాలు. కొందరు వస్తువులకు వెలగట్టుమని యిచ్చినప్పుడు తమ్ము మిగుల నాణెగాం డ్రనుకొందురని తెలియకున్నను వానికి దక్కువ వెల గట్టుచుందురు. అంతియ కాని దాని నాణె మెఱిగి కాదు. ఇది నిజముగా గాజురాయి యని యెట్లు చెప్పగలవో తార్కాణము జూపింతువా! యని పెద్దయెలుంగున గద్దించి పలికిన నతండు వెనుదీయక పెక్కేల చూడు మిదిగో యని యొక యినుపపలకమీద నా రత్నమును నెత్తికొట్టుటయు నది తిలలంతలేసి శకలములై రూపరినది.

దానితోడన యా వర్తకుని హృదయము సైతము భిన్నమైనది . వర్తకులందరు వెరగందిరి. నృపతి యతనిం గౌగిలించుకొని సుముఖా! నీ మూలమున నాకు మిగుల లాభము గలిగినది. నీవంటి నాణెగా డెందును లేడు. నీకు నెలకు నూరురూపికల వేతన మిచ్చెద. నాయొద్ద రత్నపరీక్షకై యుండుమని యతని కప్పుడు తదుద్యోగమునకు ముద్రిక నిచ్చెను. ఆ దాక్షిణాత్యుని యొద్దనున్న ధనమంతయు దోచికొనుటయేగాక యతని బద్ధునిం గావించియు నా నృపప్రవరుడు బ్రవరుని యనునయవాక్యములచే నతని విడిచిపెట్టెను.

అది మొదలు ప్రవరునికి రాజనగరిలో నుద్యోగమూలమగు గౌరవ మెంతేని ప్రబల మగుచుండెను. ఇట్లుండిన గొలదిదినములకే రాజుగారి ముఖ్యప్రధాని మరణము నొందెను. అప్పుడా రే డాయుద్యోగము ప్రవరునికే యిచ్చివేసెను. మంత్రిత్వపదవి వచ్చినతోడనే ప్రవరు డాచిన్నయిల్లు విడిచి యొకమేడ బాడుగకు దీసికొని యందప్పటికి దగిన మర్యాదగా నడుపుచుండెను. అప్పుడైనను రాజపుత్రిక ప్రవరుని గాని, ప్రవరుడు రాజపుత్రికను గాని బలాత్కరించుటలేదు. వారి మనోదార్ఢ్య మెట్టిదో తిలకింపుము.

ప్రవరుడు మంత్రియైనది మొదలు రాజ్యమందు ధర్మప్రవర్తనలు మెండుగ జరుగునట్లును ఆధర్మప్రవర్తకుల శిక్షించునట్లును పెక్కు ప్రకటన పత్రికల దేశమందు వ్యాపింపజేయుటచే నతని బ్రజలందరు ధర్మప్రభువని కీర్తింపం దొడంగిరి.

ఇట్లుండునంత నద్ధరాకాంతు డొకనా డేకాంతముగా నతని కిట్లనియె. సుమతీ! మతికౌశల్యంబున నీవు బృహస్పతియంతవాడవు. నీ ప్రాపునంజేరి లోపము లేకుండ రాజ్యము గాపాడుకొనగలనని మిగుల సంతసించుచుంటి. ఇక నీకును మాకును దెలుపు