పుట:కాశీమజిలీకథలు -01.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

99

ఆ వర్తకుడు నతని తెలివికి సంతసించుచు నెలనెలకు వేతన మభివృద్ధి జేయుచుండెను. ఇట్లుండ నతం డొక్కనాడు దక్షిణదేశమునుండి యొక వర్తకుడు అద్భుతమైన రత్నమొకటి కొనివచ్చి కందర్పకేతుని దర్శనమున కరిగి నా రత్నము సోయగమున కచ్చెరువందుచు నట్టిదానిం దన జీవితకాలములో నెన్నడును జూడమి నా రాజు దాని గొనుటకు మిగుల నుత్సాహ మందుచు దాని వెల యెంత యని యా వర్తకు నడిగెను.

ఆ వర్తకుండును రాజుగారి యుద్దేశము గ్రహించి దీని వెల కోటిరూపాయలనియు గవ్వయేమియు దక్కువైన నీయననియు గచ్చితముగా నుత్తర మిచ్చె.

కందర్పకేతుండును తనయొద్దనున్న రత్నపరీక్షకుల చేతికిచ్చి యా మాణిక్యమునకు వెల గట్టుమనిన వారును బరీక్షించి కొందరు నలువది లక్షలు కొందరు డెబ్బదిలక్షలు, గొందరు తొంబది లక్షలు జేయునని వెలగట్టిరి. అంతటితో దృప్తి బొందక యా నృపతి యా మణిని వెలగట్టింప కింకరులకిచ్చి నంగడివీధినున్న పెద్ద వర్తకులయొద్ద కంపెను.

అప్పురిలోని వర్తకులందఱు దాని నాణెము చేసిరి. యేబది లక్షలకు దక్కువ వెలగట్టినవాడు లేడు. కొందరు కోటిరూపికలు జేయుననిరి. ఈ రీతి నంగడులు ద్రిప్పుచు గ్రమంబున ప్రపరుండున్న రత్నవర్తకునియొద్ద కామణిని దెచ్చి వెలగట్టుమని రాజభటు లడిగిన దాని నతడు పుచ్చుకొని తత్తేజమునకు వెరగందుచు జెంత నున్న ప్రవరుని చేతబెట్టి వెలగట్టుమని యడిగెను. అతం డది పుచ్చుకొని ముమ్మా రిటు నటు త్రిప్పి పెదవి విరచినం జూచి యా వర్తకుడు పెదవి విరచితివి లోపమేమి? వెల యెంత జేయు నని యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె. "అయ్యా యిది యొక కృత్రిమరత్నము దీని వెల గవ్వయైన జేయ" దని యెకసక్కెముగా జెప్పెను.

ఆ మాటవిని రత్నవర్తకు లందరు దెల్లబోయి యతని నందులకు దృష్టాంత మేమని యడిగిన ప్రవరుండు కావలసిచో బరీక్ష జూపింతునని ప్రతిజ్ఞాపూర్వకముగా జెప్పెను.

రాజకింకరు లంత నా రత్నమును గొనిపోయి రేనితో వర్తకుల మాటయు బ్రాహ్మణుని వచనంబులు జెప్పిన విని వెరగుపడి యా యొడయ డప్పుడు యాబ్రాహ్మణుని దీసికొనిరమ్మని పరిచారకుల నంపెను. వారును వడివడి జని యనేకరత్నములతోగూడ నా ప్రవరుని రాజసభకు దోడ్కొని వచ్చిరి

కందర్పకేతుండును ప్రవరుని మిగుల గౌరవిపరచి కొలువుతీర్చి యాయద్భుత రత్నమును దెచ్చిన వర్తకు నెదుర నిలువబెట్టి యా విప్రునితో నయ్యా! తమ రీరత్నమునకు వెల యెంత గట్టితిరని యడిగిన నతం డిట్లనియె.