పుట:కాశీమజిలీకథలు -01.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గూడ సరిపడు సామగ్రి యిచ్చిరి. ప్రవరుడును వారివారికి దగిన ఫలములు వ్రాసి యిచ్చి యా సామగ్రి గొనిపోయి వృద్ధబ్రాహ్మణి చేతి కిచ్చిన నామెయు రుచిగా వండిపెట్టిన సంతుష్టిగా భుజించిరి.

మరునా డుదయమున బూర్వమువలె నతండు బజారున కరిగిన వర్తకులందరు నొకచోటుననే కూర్చుండి తమకు వ్రాసియిచ్చిన ఫలములన్నియు దృష్టాంతరముగా నుండుటకు మిగుల సంతసించుచు నతని వినుతించి మరల నా దినమున ఫలములు వ్రాయించుకొని పూర్వమువలెనే సామగ్రి యిచ్చిరి. దానిచేత వారు మువ్వురేగాక మరి కొందఱుగూడ దృప్తిగా భుజించిరి.

ఇట్లు ప్రతిదినము ప్రవరు డుదయమున బజారున కరిగి వర్తకులచే గౌరవము బొందుచుండ గొద్ది దినములలోనే యతని ఖ్యాతి యా యూర నలుమూలలు వ్యాపించినది.

ఆ వార్త పెక్కండ్రు వర్తకులు విని యతనిచే ఫలములు వ్రాయించుకొనుచు మిగుల సత్కారముల చేయదొడగిరి. మరియొకనా డొకరత్నవర్తకుని దినచర్య వ్రాసి యిచ్చుచు బ్రస్తావముమీద దనకుగూడ రత్నపరీక్షయందు మిగుల నైపుణ్యముగలదని నుడివిన విని యా వర్తకుడు వానిని తన రత్నముల యంగడికి గొనిపోయి తనయొద్ద నున్న రత్నముల నాణెము సేయుమనిన నతం డన్నియు బరిశీలించి యందు వారు రత్నములని కొనియుంచిన పెక్కుగాజురాళ్ళు నేరితీసి పరీక్ష చూపెను. దాని కావర్తకు డాశ్చర్యపడుచు నయ్యా తమ కీబ్రాహ్మణవృత్తియగు దైన్యజీవన మేటికి? నెల కిరువది రూపికల వేతనం బిచ్చెద. నాయొద్ద రత్నపరీక్షకై యుందురే? యనుటయు నతండు వల్లెయని మొదట నట్టి యుద్యోగమందు బ్రవేశించెను .

అదృష్టవంతులు కెందేగినను గొరంతయుండునా? అప్పుడా సత్రమున బసదీసి యొక చిన్నయి ల్లద్దెకు దీసికొని యందు ప్రవేశించిరి. కాని యప్పుడు సైత మా రాజపుత్రిక యతని మొగము జూడక మౌనం బవలంబించియు మర్యాదగా నడుచుచున్నందులకు గొంత సంతసించుచు బనిపాటలయందు గొంచె మా యవ్వకు దోడు పడుచు నొకరీతి విరాగబుద్ధితో గాలక్షేపము సేయుచుండెను.

ఆ బ్రాహ్మణియు వారిని దంపతులే యనుకొని పరస్పర సంభాషణములు లేకపోవుటకు శంకించుగొనుచు నవ్విషయము విమర్శింపక నియమితమైన పనుల గావించు చుండెను. ప్రవరుండును భోజనము సేయునప్పుడుతప్ప తక్కినసమయముల వేరొకచోట గాలక్షేపము సేయుచుండును. ప్రవరుడుగాని రాజపుత్రికగాని ముసలియామెగాని యొండొరుల వృత్తాంత మరయకయే కాపురములు సేయుచుండిరి. ఆహా! వారి బుద్ధిపటిమ మిగుల గొనియాడదగియున్నది గదా?