పుట:కాశీమజిలీకథలు -01.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

97

గానుకగా నిచ్చుచున్నాము. ఈ యవ్వను నిక నిర్బంధింపకుమని పలికి యది వాని కిచ్చెను.

వా డది సంతోషముతో గైకొని యతనిని మిక్కిలి స్తుతియించుచు నెమ్మదిగా నోడనడిపెను.

అంత కొంతతరి కత్తరి యవ్వలిదరి జేరినంత బ్రవరుడును రాజపుత్రికయు నోడ దిగి నడువజొచ్చిరి. ఆ వృద్ధబ్రాహ్మణియు వారిని దంపతు లనుకొని వారు తనకు జేసిన యువకారమునకు గృతజ్ఞత జూపుచు వారివెంట నడుచుచు నా ప్రవరునితో నిట్లనియె. అయ్యా! నేను దిక్కుమాలినదానను. నాకింత యన్నము పెట్టనోపుదురేని మీ యింట వంట జేయుచుందును. తోడగొనిపోదురే యని యడిగిన నతండు లోన నవ్వుకొనుచు నవ్వా! ఆలాగుననే రమ్ము పోషింతునని యామెంగూడ వెంటబెట్టుకొని నడువసాగెను.

ఆ చిన్నదియు నేమియుం బలుకక వాని మొగమైనం జూడక దైవమునుం దూరుచు హా! జయంతా! జయంతా! యని నడుమ నడుమ బలవరించుచు నేమి సేయ దలంచియోగదా! దైవము న న్నీతని కప్పగించెను. వీని విడిచినచో బ్రమాదమగును. వీనితోడం బోయెద నేమైన నగుగాక యని యతనివెంట నడువజొచ్చెను.

ఆ మువ్వురు మధ్యాహ్నమునకు నా ప్రాంతమందున్న హేలానగరము జేరి సత్రమున బసచేసిరి. ప్రవరుండును. సత్రాధికారియొద్ద కరిగి నాటికి సరిపడిన సామగ్రి యడిగితెచ్చి యా యవ్వకిచ్చిన నా ప్రోడ జక్కగా బాకము చేయుటయు మువ్వురును భుజించిరి.

మరునా డరుణోదయంబున లేచి యా బ్రాహ్మణుడు స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు నిర్వర్తించి మేన విభూతి నలది బ్రహ్మతేజంబు మెరయ బంచాంగ మొకటి తీసికొని విపణివీధి కరిగి యందు గొప్పవర్తకులందరు నెద్దియో బేరమునకై నొకచోట గుంపుగా జేరియుండ నచ్చటికేగెను. వారు నతనికి నమస్కరించి యాగమనకారణం బడిగిన నాశీర్వదించి యతం డిట్లనియె.

అయ్యా! నేను బ్రాహ్మణుడను పరదేశస్థుండ కుటుంబముతో నిన్న నీయూరు జేరితిని. సత్రము మూలముగా నిన్నటికి భోజనము గడిచినది. ఈ దినమున కేమియును లేదు. నాకు జ్యోతిశ్శాస్త్రమందు మిగుల పాటవము గలదు. మీ మీ నక్షత్రములు జెప్పినచో దినచర్య వ్రాసి యిచ్చెదను. దృష్టాంతరముగా నుండిన నన్ను మన్నింపుడు. లేనిచో రేపు నన్ను గౌరవము సేయవలదని ప్రతిజ్ఞాపూర్వకముగా నుడివిన నతని మాటలకు సంతసించి తమ నక్షత్రములు వ్రాసి యిచ్చి యానాటికి బిండివంటలతో