పుట:కాశీమజిలీకథలు -01.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యుదుట వహించినది. అట్టి యవసరంబున నా ప్రవరుండును నచ్చటనే గుఱ్ఱము దిగి యమ్మగువ నేమియు బలకరింపక రెండు దంతకాష్ఠములు విరచితెచ్చి యొకటి యా రమణి ముందరవైచి తాను పల్లు తోముకొనియె. అవ్వనితయు దానిం దీసికొని ముఖ మార్జనంబు జేసినది.

అట్లయ్యిరువురు ప్రాతఃకృత్యంబుల నిర్వర్తించి యొకరినొకరు పలుకరింపకయే గుఱ్ఱముల నెక్కి జాము ప్రొద్దెక్కు పర్యంతము నడిచినంత నొక నది యడ్డమైనది.

అచ్చట గుఱ్ఱములు విడిచి అంతకుమున్ను కొందరు జనుల నెక్కించుకొని విడచుటకు సిద్ధముగానున్న చిన్నయోడ నొకదానింగాంచి వడివడి నరిగి వారుగూడ నా యోడ నెక్కిరి.

పిమ్మట నోడద్రోయించి కర్ణాధారుండు అవ్వలిరేవు చేరునంతలో నందుగల జనులవలన దాటించుటకు నియామకమగు సొమ్మడిగి పుచ్చుకొనుచు నందొకబ్రాహ్మణ విశ్వస్థయుండ నామెను సొమ్మిమ్మని యడిగెను,

ఆ యవ్వయు దీనస్వరముతో నాయనా! నేను మిక్కిలి, దరిద్రురాలను. నా యొద్ద నేమియులేదు. యెవ్వరి యొద్దనైన బనిచేసి యుదరపోషణ జేసికొనవలయు నని యఱుగుచున్నదాన. ఇట్టి దీనురాలిం గనికరించి యూరక దాటించిన నీకు మిగుల పుణ్యము రాగలదని యెన్ని విధములనో బ్రతిమాలినది . కాని వానికి దయవచ్చినది కాదు.

అమ్మా! దీనికి మే మెక్కుడుగా బన్నిచ్చుకొనవలయును. ప్రతిదినము మీవంటి వారు పెక్కండ్రు వచ్చుచుందురు. అందరిని నూరక రేవు దాటించినచో మేమిల్లు వాకిలి నమ్ముకొనవలసినదే. సొమ్మియ్యక తీరదు. లేనిచో నవ్వలనే దించివేయుదుమని యా నావికుం డుత్తరము చెప్పెను.

అట్లామె నా సరదారుడు సొమ్ముదెమ్మని నిర్బంధించుచు నాదరించి గూర్చున్న ప్రవరుం జూచి–అయ్యా! తమరుగూడ సొమ్మిత్తురా యని యడిగిన నా ప్రవరుండు చింతాక్రాంతుండై యోహో వీనికిచ్చుటకు నాచేత నేమియును లేదు. వీని ధోరణిం జూడ నూరక దాటించునట్లు కనబడదు పేదరాలి నీ యవ్వనే నిర్బంధించుచున్నాడు. వీనిచే నవమానము పడుట కష్టము. ఎట్లొకో యని తలంచుచు నా ప్రాంతమందే యధోముఖియై కూర్చుండియున్న యా చిన్నదానిని సంజ్ఞపూర్వకముగా జూపెను.

అప్పుడా సన్న గ్రహించి యా యించుబోడి తా దెచ్చిన నాణెములలో నొకటి విప్పి యతని ముందర విడిచినది. దానిం గైకొని ప్రవరుండు సంతోషముతో నావికుడా! ఈ నాణెము నీ వడిగెడు సొమ్మునకు బదిరెట్లు వెలగలిగి యున్నది. దీని నీకు