పుట:కాశీమజిలీకథలు -01.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

935

అట్లయ్యిరువురు నరుగుచున్నతరి నత్తరుణి ప్రవరుని గుఱ్ఱముదరికి దనవారువము బోనిచ్చి నాథా! నేటికి మన మనోరథ మీడేరినది గదా. మొన్నటినుండి నే నీపయనంబున కెంత ప్రయాసపడితి ననుకొంటిరి. రాత్రియు నొకయవాంతరము వచ్చినది కాని దైవకృపచే దాటించితిని.

గానకళానిపుణిక యగు గణిక యొకతె రాత్రి సంగీతము బాడుననియు దానిం బరీక్షించుటకై రమ్మని నాకు మాతండ్రి వార్తనంపెను. తలనొప్పి వచ్చెనని బొంకి యంకిలి జెప్పితి నింతవట్టు దైవానుకూలము గానే యున్నది. మీకు నట్టి విష్నుము లేమియు రాలేదుగదా యని యనేకరీతుల దన మనంబునగల కోరికలన్నియు బయలు పరచుచున్న యన్నాతిమాటల నూకొట్టుచు నతండు గొన్నిటికి నప్పటికి దగినట్లు ప్రత్యుత్తరము జెప్పుచు నడువజొచ్చెను

అంత నక్కాంత మోమిట్టు తెల్లతెల్ల పోవునని తెలుపురీతి దిక్కులదావళ్యము బిక్కటిల్ల తెల్లవారజొచ్చిన గ్రమంబున భానుండు పూర్వశిఖరం బలంకరించుటయు నమ్మించుబోడి యవ్వెలుంగున వానిం బరీక్షించి తన మనోహరుడైన జయంతుడు కాడని యెఱిగి యంతరంగము తత్తరమంద దత్తడినుండి నేలంబడి మూర్ఛిల్లి కొండొకవడికి దెలిసి మరల నతని దిలకించి ధరించిన మలిన వస్త్రములంబట్టి యతని నల్పునిగా దలంచి తలయెత్తి పొల్లుపొల్లుగా గన్నులనుండి నీరు స్రవించుచుండ నేడ్చుచు నిట్లని తలపోసెను.

అయ్యో దైవమా! తల్లిదండ్రుల మక్కువ లెక్క సేయక చుట్టముల ప్రేముడి విడనాడి వయస్యప్రీతి బూతిగలపి కులశీలసుగుణపరిపాటి నీటబుచ్చి ప్రజానింద కోర్చి ప్రాణత్యాగమునకు సహించి యొక్కచక్కనిపురుషునిం గూడదలచిన దక్కింపక యీ నిర్భాగ్యుని నా కెక్కడ దెచ్చిపెట్టితివి? కటకటా! నాచక్కదన మిక్కడియడవిపాలు సేయుదే? ఇప్పు డేమి సేయుదాన? మరల పురికరిగినచో నురిదీయ నియమింతురు గాని వెనుకటి మక్కువ నుంతురా? ఆహా! దైవఘటనము.

శ్లో॥ "ఆఘటిత ఘటితాని ఘటయతి ఘటిత ఘటితాని దుర్ఘటీకురుతే
      విధి రేవతాని ఘటయతి యాని పుమాన్నైవ చింతయతి"

అను శ్లోకమును పలుమారు పఠించుచు మరియు ధైర్యము దెచ్చుకొని,

శ్లో॥ "ఉపస్థిరే విప్లవ ఏవపుంసాంసమస్తభావః పరిమీయతేయతః
      ఆవాతి వాయౌనహితూలరాశే ర్గీరేశ్చ కశ్చిత్ప్రతిషాతిభేదః."

అనగా ఆపదలు వచ్చినప్పుడే దైర్యమును నిలుపుకొనతగినది. గాలి విసరునప్పుడే గదా దూదిరాశికిని పర్వతమునకుగల భేదము తెలియపడుచున్నది. కావున బుద్ధిమంతు లాపత్సమయమందే తమ దెలివిని గనపరచుదురని నిచారము విడిచి