పుట:కాశీమజిలీకథలు -01.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

విదేశమున కరుగ సిద్ధపడివుంటి. సరిపడని వరునితోగూడి రాజ్యము సేయుటకంటె నిష్టమగు మగనితో ముష్టి యెత్తుకొనినను దృప్తిగా నుండునని యిదివరకే చెప్పితిని గదా. పెక్కేల? యెల్లుండి అమావాస్యనాటి రాత్రి మా కోటకు పడమర ప్రక్కనున్న గుఱ్ఱముల సాలలోనికి వచ్చియుండుము. గొలుసువెంబడి గోట దిగివత్తును. గుఱ్ఱము లెక్కి యెక్కడికేనిం బోవుద మిదియె ముమ్మాటికిని నమ్మకమయిన ప్రయాణమనిన జయంతుండు నొడంబడియె. అట్లయ్యిరువురు బాస జేసికొని బండియెక్కి యిండ్ల కరిగిరి.

పిమ్మట ప్రయాణదినంబున విలువగల వస్తువులు నిమిడిగల పుట్టములు నాహారపదార్ధములు సాయంకాలము దనుక సంగ్రహించుచు నమ్మంత్రిసూనుడు చీకటిపడినతోడనే బోజనము సేయ ప్రయత్నించెనుగాని నాడు దండ్రియు రాజనగరినుండి యింటికి బెందలకడ వచ్చెను. భోజనమునకై మడిగట్టుకొనిన తండ్రి పంక్తినే కుమారునికి గూడ వడ్డించిరి. కుడుచునప్పుడు కొడుకుతో దండ్రి యిట్లనియె.

వత్సా! విదేశమునుండి సంగీతవిద్యాపారంగతురాలగు వారాంగన యోర్తు వచ్చినది . ఈరాత్రి నగరిలో సంగీతసభ జరుగును. దానిం బరీక్షించుటకై నీకు మిగులపాటవము గలదని మీగురువు రాజుతో జెప్పియున్నాడు. నే నింటికి వచ్చునప్పు డతడు నాతో నిన్నుకూడ నీరేయి సభకు దోడ్కొని రమ్మని నుడివెనుగాన బరుండక మంచిదుస్తులను గట్టుకొని సిధ్ధముగా నుండుము పోదమనుటయు నాపలుకు లతని చెవులకు ములుకులవలె నాటిన గొండొకవడి నేమియు బలుకనేరక విశ్చేష్టుండై యూరకున్న నతం డేమిరా మాటాడవు. గానప్రావీణ్యము నీకు లేదా యేమి యనుటయు నతం డయ్యా! నా కీదినమున దలనొప్పిగా నున్నదిగాన నట్టిదాని పూర్తిగా బరీక్షించలేనని తోచుచున్నది. అందులకై యూరకుంటి ననిన మంత్రి యెట్లయినను నగరి కరుగక తీరదు. ఓపిక లేనిచో రాజుగారితో నీ సంగతి చెప్పి యతని చిత్తవృత్తిప్రకారము నడువవలయుననిన జయంతుం డనేకప్రతికూలవాక్యములు జెప్పి ప్రాల్మాలదలచెను గాని తండ్రి యొప్పుకొనుక పోవుటచే తుద కతనితో రాజసభ కరుగక తీరినదికాదు.

తండ్రితో రాజసభ కరుగునప్పు డాజయంతునికి మనంబునగల చింత యిట్టిదని చెప్ప మనోగమ్యము గాదనినచో వాక్కులకు శక్యమా? ఆవృత్తాంత మారాజపుత్రిక యెఱుగక యనుకొన్నరీతిని గొలుసు దిగి గుఱ్ఱపుసాల జేరి యందు నిద్రించుచున్న ప్రవరుని రా జయంతుడే యనుకొని యతనితో దురగమెక్కి యేగినది.

శౌనకా! పూర్వోత్తరసందర్బ మెఱింగితివిగద. తా నొకటి తలచిన దైవ మొకటి తలచునను లోకోక్తి యేల తప్పును?