పుట:కాశీమజిలీకథలు -01.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

93

యంతఃపురమున బ్రవేశపెట్టుమనియు మాయమ్మ మజ్జనకునితో నుడివినది. అతం డట్టిపనికి రేపు విదియ యుక్తముగా నున్నదని యేర్పరచెను. నేటితోడ నాకు నిను జూచు భాగ్యము దప్పిపోవుచున్నది. పెండ్లి విషయమై గొంత ముచ్చటించిరి. కాని నాకు స్పష్టముగా దెసినది కాదు. ఎవ్వరికో నిశ్చయించినట్లు నాకొక దాది చెప్పినది. ఈ రెండు విషయములు నా మనోభీష్టమునకు వ్యతిరేకముగానే యున్నవి. నిన్ను జూడ నొకనిమిషమైనను జాగైనచో బ్రాణములు బోవునంత వంతబూను నేను నీ చిరకాలవియోగ మెట్లు సైతును. దేహములు మాత్రము భేదములు గలిగి విద్యాగుణరూపశీలధీవకిత్తుల నొక్కటిగా సంచరించు మన యిరువురకు బెండ్లి సేయక యశాశ్వతపు సిరికై యాసపడి నన్నెవ్వరికో యియ్యదలచిన మా తండ్రికన్న మూఢుం డుండునే? అయ్యయ్యో! కామినులకు సంపద కలిగినను దగని మగనితో గాపురము సేయుటకన్న విద్యారూపచతురుండగు మగనితో ముష్టియెత్తుకొనినను సంతుష్టిగా నుండునుగదా.

సీ! ఈ యాడుజాతి యస్వతంత్రపుబ్రతు కేమని గర్హింతు. తల్లిదండ్రు లే తుచ్చునికి గట్టిపెట్టినను వానిని దైవముగా జూచుకొనుచు శుశ్రూష చేయుచుండవలయునట. నాకు జ్ఞానమువచ్చినది మొదలు నిన్ను బెండ్లి యాడవలయునని యభిలాష గలిగియున్నను నెన్నడును లజ్జాదోషంబున నట్టి కోరిక బయలుబెట్టనైతిని. వసంతా! నిన్ను గాక వేరొక్కని బెండ్లి యాడవలయునని నాకు లేదు. దీని కెద్దియేని యుపాయమున్న నుడువుమని యడిగిన నప్పడతి కతం డిట్లనియె.

తరుణీ! అట్టి కోరిక నాకును బెక్కుదినములనుండి గల్గియున్నను నేను ముందు బయలుపరచినచో నీ చిత్తవృత్తి యెట్లుండునో యని మనంబున నణచుకొనియుంటిని. మన యిరువురకున్నను నేమి లాభము? కులమున సమానుండనైనను సంపదచే హీనుండనగుట నాకు మీ తండ్రి నిన్నియ్యనొడంబడడు. దీనికేమి సేయుదము. అందరాని పండ్లకు జేతులు సాచనేల? సాహసకృత్యంబుల కొడంబడుమని నుడుపుట నాయదికాదు. అదియు నీ మాటలనే తేటపడవలయునని భావగర్భితముగాఁ బలికిన నక్కలికి వసంతా! యని మేను గరుపార బిలిచి యింకను సందియ మందెదవేల? నా డెంద మిదివరకే నీ యధీనమైనది నీ యిష్టము వచ్చునట్లు నడుచుదాన గర్తవ్య ముపదేశింపుమని పలికిన నతం డట్లయిన నేనొక యుపాయము వక్కాణింతు వినుము. నీకు ముఖ్యముగా నన్ను బెండ్లియాడవలయునను తలంపు గలిగియున్నచో విదేశ మరుగవలయును. అంతఃపురంబుల నత్యంత సుకుమారవంతురాలవై సుఖపడుచున్న నిన్నిట్లు వెడలుమని చెప్పుటకు నోరాడకున్నది. పైన నీ చిత్తమనవుడు నవ్వుచు నవ్వనిత నిట్లనియె.

మనోహరా! నేను నీదాననని చెప్పినను వేరొక్కరీతి బలికెదవేల? నీతోడ