పుట:కాశీమజిలీకథలు -01.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఇంతలో నన్నెలంతయు గొలుసు దిగివచ్చి యాసాల నలుదెసలం బరికించి యొకమూల గుఱ్ఱుపెట్టుచున్న యాప్రవరునొద్ద కరిగి మెల్లన వీపుమీద జేయివయిచి తడుముచు లెమ్మని పిలిచిన నతండు వెరగుపడుచు మారుమాటాడక కన్నులు నులిమికొనుచు లేచి కూర్చుండెను. అప్పు డానాతి యతని హస్తసంజ్ఞచే నందున్న నొకగుఱ్ఱమును జూపి యెక్కుమనవు డతం డిట్టట్టనక యట్లు చేసెను.

అక్కలికియు నొక్కవారువ మెక్కి ముందు నడువ వెనుక ప్రవరుండును సమముగా దనహయమును నడిపించెను. అట్లయ్యిరువురు పురము వెడలి పడమరదెసనున్న యడవిమార్గంబునం బడి వడివడి దత్తడుల నడిపింపసాగిరి. అని యెఱింగించుచు మణిసిద్ధుని సుద్దుల కడ్డమువచ్చి పతంగు డిట్లనియె.

అయ్యా! అయ్యబల యెవ్వతె? అట్లు కోటగోడ దిగివచ్చి యెన్నడును నెఱుగని యతనితో నరుగ గారణమేమో యెఱిగింపుమన వాని ప్రశ్నకు సంతసించి యయ్యోగిపుంగవుం డిట్లనియె.

గోపా! యా పాటలగంధి వృత్తాంత మాకర్ణింపుము. కాంచనవల్లి యను పేరంబరగు నా తరుణి జయసేనుం డనందగు నానగరాధీశ్వరుని గూతురు. ఆ రాజు తనకు లేకలేక కలిగిన యక్కన్నెమిన్నను మిగుల గారాబముగా బెనుచుచు నైదేడులు ప్రాయము వచ్చినతోడనే సకలశాస్త్రము లామూలచూడముగా దెలిసికొనిన యొకగురువునొద్ద సవయస్కుండగు జయంతుడను మంత్రిసూనుని జతపరచి జదువవేసెను.

అక్కన్యయు నక్కుమారుండును రూపంబునను గుణంబులను శీలంబునను సుకుమారంబునను బుద్ధికౌశల్యంబున నొండొరులను మించుచు నయ్యాచార్యునొద్ద గ్రమంబున సకలశాస్త్రములు గ్రహించి సంగీతమునందును గవిత్వమునందును మిగుల నేర్పరులై యశ్వశిక్షయందు సైతము నెన్నదగిన పాటవము నేర్చుకొనిరి.

వారిరువు విద్యాగ్రహణసమయమందుగాక ఆహారవిహారనిద్రాదివ్యాపారములయందును నొకగడియయేని విడిచియుండక యేకదేహమట్ల యతిమైత్రితో మెలంగుచుండిరి. ఇట్లు పదియారేడుల ప్రాయము వచ్చుపర్యంతము విద్యలం గఱచుచు నొకనాడు సాయంకాలమున జల్లనిగాలి విసరుచుండ నయ్యిరువురు గుఱ్ఱపుబండిమీద విహారార్థమై పూవుదోట కరిగి యందు గ్రీడింపుచుండ నయ్యండజయాన మంత్రిసూనున కిట్లనియె.

వయస్యా! నిన్నటిరేయి మాయింట జరిగిన వార్త నీవు వింటివా? నాక్రివకంపుజవ్వన మేటికి బొడసూపినదో కాని నీకును నాకు నెడబాపుటకు మూలమగు చున్నది. నన్నింక బడికిని బైటికిని బోనియ్యవలదనియు గురుదక్షిణ నిప్పించి