పుట:కాశీమజిలీకథలు -01.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

89

లేలుకొమ్ము ఇదిగో నా మంత్రప్రభావంబు జూడు: నీ మగనిం గుక్కం జేసితి. నరచుచున్నాడనిన విని యవ్వనిత గుండెలు ఝల్లుమన మూర్చిల్లి యంతలో దెలిసి అయ్యో! దైవమా దొంగలనుండి చావుదప్పించుట న న్నీనీచున కొప్పగించుటకా! మంచిమగడు దొరికెనని సంతసించు నన్ను బై కెత్తి నేలవైనట్లు జేసితివి. ఇంతకన్న మరణమే మేలుగదా యని పెక్కుతెఱంగుల లోలోపల విలపించుచు; మూర్ఖునికడ నీతివాక్యములు చెల్లవని యూహించి మాయచే వాని వంచింపదలంచి యా చతుర కోయదొర కిట్లనియె.

దొరా! నా పూర్వపుణ్యము మంచిది గనుక నీవు నాకు దొరకితివి. కాని యొక్కటి యాలోచించుచుంటిని. నీకిదివరకున్న పెట్టకును నాకును బడుట కష్టముగదా! మన మిందున్నచో నది చూచి సహించునా? దేశాంతర మరిగినచో నేబాధయు లేక సుఖింపవచ్చును. అక్కడ మంచిముహూర్తమున నిన్ను బెండ్లి యాడెదననిన, వా డందులకు సమ్మతించి కామపరవశుండై యున్నవాడు గావున నా రాత్రి భార్యాపుత్రుల గణింపక యా కనకప్రభ మాట నమ్మి యూరు వెడలిపోయెను.

అక్కలికియు గుక్క మెడత్రాడు నొకచేతం బట్టుకొని రెండవచేత నా కత్తులలో నొకటి దీసికొని వానివెంట నరిగెను. అట్లయ్యిరువురు మరునాడు జాము ప్రొద్దెక్కుదనుక నడవిత్రోవం బడి నడిచిరి. అప్పు డెండవేడిమియు మనోవ్యధయు దన్ను బాధింప నయ్యబల బలముచెడి నడువలేక నేలం జతికిలబడిన వాడామె కుపచారంబు సేయుచు మంచిఫలంబులందెచ్చి యిచ్చి యలసట బోగొట్టెను.

మఱియు నడచునప్పు డక్కోయ యబ్బోటితో మాటిమాటికి "బెండ్లి మాట యేమి సెప్పితి" వని యడుగుచుండ మంచిముహూర్తమునగాని కూడదని యాప్రోడ యుత్తరము చెప్పుచుండెను.

వెండియు రెండుదినములయిన వెనుక నొకనా డాచేడియ వానితో నోరీ దొరా! ఈ మార్గ మెక్కడికి బోవునో యెఱుగుదువా యని యడిగిన వాడిట్లనియె.

[1]పెట్టా! ఈ దారి వంగదేశరాజధానియగు హేలాపురంబున కరుగును, తరచు నే నాదేశమునకు గస్తురి జామరములు పునుగు జవ్వాజి తేనె మొదలగు వస్తువులు పంపుచుందును. దారి నాకు బాగుగా దెలియు ననిన నవ్వనితయు దియ్యనిమాటలతో వాని మానసము లాగుకొని మరికొంత దవ్వరిగిన వెనుక నోరీ నీ మంత్రశక్తి మిగుల గొనియాడదగియున్నది. మనుష్యుని నిమిషములో గుక్కను జేసితివి. మేలు

  1. కోయవాండ్రలో మగవానిని దొరయనియు, ఆడుదానిని పెట్ట యనియు పిలుచుట వాడుకలో గలదు.