పుట:కాశీమజిలీకథలు -01.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గావింపుడు. నా పినతల్లి కూతురు పద్మగంధి యనునది మిక్కిలి చక్కనిది. దానికి నడుమ నెద్దియో రోగమున గన్నులు పోవుటయు దానితండ్రి యవి చక్కబరచినవానికి రాజ్యముతో నక్కన్య నిచ్చెదనని ప్రకటించి తుదకట్లు జేసెను. ప్రాణదానంబు జేసిన నిన్ను నేను పెండ్లియాడుట కేమి యాశ్చర్యమని పలికిన నా మాటలాలించి సంతోషముతో రాముండా రామం గౌగలించుకొని యోహో! మరదలా! నీవా? తెలిసినది. నీ యప్పయగు పద్మగంధికి గన్నులిచ్చి పెండ్లియాడినవాడను నేనే. చక్కదనమును గుఱించి నీ యాస్తత్వమును గుఱించి పెక్కుసారులు పద్మగంధి నాతో జెప్పినది . మేలు మేలు. దైవగతి యెంత చిత్రముగా సంయోగవియోగముల గావించుచుండును. అని యూశ్చర్యపడుచుండ నప్పడుచు నతని బాంధవ్యమును గుర్తెరింగిన మీదట మించిన యనురాగముతో పద్మగంధి యదృష్టమును వేతెరంగుల నభిమతింపుచుండ నతడు దానినప్పుడు గాంధర్వవిధి వివాహంబాడి యక్కత్తుల రెంటిని జేత నమర్చుకొని నిర్భయముగా నయ్యడవిలో నామెతో బ్రయాణము జేయుచు సాయంకాలమున కొకకోయపల్లె జేరెను.

ఆ పల్లెలో నిళ్ళన్నియు జిన్నవిగానే యున్నవి. కోయదొర యిల్లు మాత్రము కొంచెము పెద్దది. వాని యింటికరిగి యోదొరా! యీరాత్రి నివసించుటకు గొంచెము చోటిచ్చెదవా? యని యడిగిన నతం డయ్యంగన యందమునకు వలచి నవ్వుచు నిచ్చెద నీలాగున రండి అని వారికొక గది చూపించి దానిలో బ్రవేశపెట్టెను. అడవి మృగమువంటి కోయదొరను మరులుకొలిపిన నత్తరుణి సోయగము వేరే వర్ణింప వలయునా?

మఱియు వా డారాత్రి యామెయందుగల మోహంబునంజేసి వారికి దినుటకై మంచి గృహస్తునివలెనే పాలును తేనెయు మధురఫలములు లోనగునవి యందిచ్చుచు నభిప్రాయసూచకములగు నాలోకముల నాచకోరాక్షి నీక్షించుచుండెను. వారట్టి పదార్థములచే నాకలి తీర్చుకొని మిగుల నొగిలియున్నవారు గావున బెందలకడ గాఢముగా నిద్రబోయిరి.

తరుచుగా గోయవాండ్రకు మంత్రములు, తంత్రములు దెలియునను విషయము లోకవిదితమే. అక్కోయదొర యట్టి మంత్రముల బెక్కు నేర్చినవాడగుట మంత్రించిన యక్షతలు కొన్ని నిద్రించుచున్న యా రామునిపై జల్లిన నతం డొక కుక్కయై లేచి మొఱుగజొచ్చెను.

అయ్యెలుంగున నయ్యంగన మేలుకొని పక్కలో మగనిం గానక తొట్రుపడుచు నలుదెసలం బరికింపుచుండ నా దండ కా కోయదొర యరుదెంచి సానీ! వెరవకుము. నేను విన్ను వలచితి. నీ కే కొదువయు లేదు. నన్ను బెండ్లి యాడి యీ కోయరాజ్యం