పుట:కాశీమజిలీకథలు -01.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మేలు. బాపురే యని పొగడుచు నీ సామర్థ్యము చూతము ఈ కుక్కను మరల మనుష్యుని జేయగలవా యని యడిగిన వాడు సాని! నే నట్టి మంత్రము జెప్పుకొనలేదు. దాని ప్రక్రియ గుర్తెఱింగినవాడు హేలానగరములో సత్రప్రాంతమందున్న మఠములో నున్న బై రాగి యొక్కడే. నే నొకనాడు వర్తకమునకై యా యూరరిగి నప్పు డతనితో గొంత ముచ్చటించి కొన్ని క్రియలు దెలిసికొంటిని. కాని యీ రహస్య మెఱింగించినవాడు కాడు. ఇప్పు డట్టియవసర మేమి యున్నది. నా పెండ్లి మాట యేమి చెప్పితివని యడిగిన వానికా నాతి యిట్లనియె.

ఈ దినమున బెండ్లి యాడుటకు బాగుగానున్నది. మా కులాచారము చొప్పున ముందు జెట్టునకు మ్రొక్కి పిమ్మట బెండ్లి యాడవలయు గావున గొన్నిపూవులదెమ్మని నుడివినంత వాడెంతేని సంతసముతో నరిగి మోపెడు పూవుల దెచ్చియిచ్చెను.

అ లతాంగియు నొక వృక్షమూలమున కరిగి యా కుక్కనందు గట్టి నొక్కకత్తి యచ్చటనే నిలబెట్టి యా కుసుమములన్నియు నా పాదపమునకు బూజించి దానిమొదట సాష్టాంగ మొరగి కొండొకసేపు భగవంతుని ధ్యానముచేసి లేచి దొరా! నీవుకూడ నిట్లు కన్నులు మూసికొని యీ మ్రానునకు మ్రొక్కుము నీకు బెండ్లి యగు ననియె. వాడును బెండ్లి సంతోషముతో గన్నులు మూసికొని యాపాదపముమ్రోల జేతులు జోడించి నేలం బండుకొనియెను. వెంటనే బంటుతనముతో నా రాచబిడ్డ యక్కత్తి చేత నమర్చుకొని యొక్కవ్రేటున వాని తల నరికి మేనితో వేరుచేసెను.

ఊరక యొకని కపకారము జేసినవాడు పుడమి బెద్దకాలము మన్నునా ? అయ్యంగన వానిని గడ తేర్చి నా రూపమేగదా నన్నిన్ని పాట్లు పెట్టినది. దీనిం గప్పిపుచ్చినచో న న్నెవరును జూడరని నిశ్చయించి యొడల మసిబూసికొని యక్కోయగుడ్డలతో వికారమగు మగవేషము వేసికొని యా కుక్క మెడత్రాడు గత్తియు జేత బూని వంగదేశ రాజమార్గమునంబడి కతిపయప్రయాణంబున నా హేలానగరముం జేరెను అని చెప్పునంతలో బ్రయాణసమయ మగుటయు స్వాములవా రంతటితో గథ జెప్పుట చాలించి గొల్లవాని గావడి యెత్తుమని చెప్పి వానితోడ క్రమంబున నాల్గవ మజిలీ జేరి యందు భోజనమైన తరువాత సుఖాసీనుడై యగ్గోపాలునకు దరువాత కథ నిట్లు చెప్పదొడంగెను.