పుట:కాశీమజిలీకథలు-12.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


క. పన్నగకేయూరు మహా
   పన్నగ శతహారు నెడఁద భావించుచు భా
   స్వన్నీతిఁ దపము జేసిరి
   కొన్ని దినంబులు జలంబెగ్రోలుచు వారల్‌.

ఇట్లత్యంత నియమంబున ద్వాదశమాసంబులు మహాతపం బొనరించు చుండెను. త్రయోదశమాస ప్రధమ దివసంబున సమాధి నిష్ఠాగరిష్ఠుండై యఖండ సచ్చిదానంద స్వరూపుండైన పరమేశ్వర దివ్యజ్యోతిర్లింగమూర్తిని మనంబున భావించి చూచుచుండ భాగ్యాతిశయంబున నా జ్యోతిర్లింగము నడుమ నద్భుత తేజస్సంపన్నుఁ డగు దివ్యబాలకుం డొక్కండు గానఁబడియె. ఇట్లుద్భవించి యా దివ్య శిశురత్నము గర్భాగారంబెల్ల ప్రతిద్వనించునట్లు ప్రణవపూర్వకంబగు శ్రుతుల పఠించుచుండ వీక్షించి యానందపులకిత గాత్రుండై లేచి యంజలిపుటంబు నిటల తడంబున ఘటించి మహాభక్తి పురస్సరంబుగా నా విశ్వానరుం డాబాలరూపంబుననున్న విశ్వేశ్వరు ననేక విధంబుల స్తుతించి సాష్టాంగదండ ప్రణామంబు చేసిన నతనిం గరుణించి యా దేవోత్తముఁ డిట్లని యానతిచ్చెను.

భూదేవోత్తమా ! నీ యభీష్టంబే నెఱుంగుదును. కొలఁదికాలమున సాధు చరిత్రయగు నీ భార్య శుచిష్మతికిఁ బుత్రుండనై పుట్టి మీ కోరిక తీర్చెదను. కాశీ పురంబున నన్నుగూర్చి చేసిన తపంబు పెంపునఁ బొందరాని కోరికలుగలవే ? యని యానతిచ్చుచుఁ జూచుచుండగనే యంతర్హితుండయ్యెను. విశ్వానరుండును విశ్వేశ్వరుని భక్తవాత్సల్యమునకుఁ బెద్దగా స్తుతించుచు మహాసంతోషమున శచిష్మతి వెంటరా నిజ నివాసంబున కేగెను.

356 వ మజిలీ

గృహపతికథ

అంతఁ గొన్ని దినముల కా శుచిష్మతి యంతర్వత్నియై నవమాసములు నిండిన పిదప నొక శుభలగ్నమున నామెకు నీశ్వరప్రభావంబున నర్చిష్మంతుని యంశంబున విశ్వేశ్వరా పరావతారమని యెల్లరుంబొగడ దివ్యతేజంబునొప్పు నొక్క సుతుండుద్బవించె. పుత్రుఁడుద్బవించినమాట విని విశ్వానరుఁడు విశ్వేశ్వరుని కరుణా కటాక్షమున కెంతేని సంతసించి యా శిశువునకు క్రమంబున -


సీ. పుట్టినప్పుడె జన్నిగట్టులరావించి
              జాతకర్మమొనర్చె ప్రీతిమీఱ్స్
    పదునొకండవనాఁట బారసాలన్‌‌గృహ
             పతినాగబేర్వెట్టె బ్రజ్ఞమీఱ