పుట:కాశీమజిలీకథలు-12.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వానరుని కథ

291

కావున నట్టిగృహస్థాశ్రమంబు స్వీకరించి కైవల్యంబు వడసెదంగాక యని నిశ్చయించు కొనెను.

అట్టి నిశ్చయముతో నతం డత్యుత్తమవంశ సంజాతయగు శుచిష్మతియను బాలికామణిని శాస్త్రోక్తవిధి నుద్వాహంబయ్యెను. శుచిష్మతియును శృంగార రూప కళా వైదగ్ధ్యంబుల జీవితేశ్వరునకు ప్రియంబొనరించుచు మహాపతివ్రతయై యలరారు చుండెను. ఇట్లు పెద్దకాలమున సంసారసుఖంబులనుభవించుచున్నను నాదంపతులకు సంతానలాభము కలుగలేదు. ఒకనాఁడు శుచిష్మతి భర్తసన్నిధి కేకతమున నరిగి సాధు వచనంబుల వానింబ్రసన్నుని జేసికొని యల్లన నిట్లనియె.

ప్రాణేశ్వరా ! నీకు సహధర్మిణినైనందున నన్నుబోలు భాగ్యవతి పుడమిపై నెందును లేదు. భోగభాగ్యంబుల నాకేమియు కొదవలేదు. ఇన్నిగలిగినను సంతానము లేకుండుటచేఁ గొఱంతవడియుంటిని యిక్కొఱంత యే యుపాయంబువలనఁ దీర్ప వచ్చునో తెలిసికొని నా హృదయశల్యము నూడఁబెఱకుము. నన్ను రక్షింపుమని ప్రార్ధించుటయు నా గృహమేధి యిట్లనియె. ప్రాణేశ్వరీ ! దీనికై నీవింత చింతింప నేమిటికి మనము భక్తజన కల్పద్రుమంబైన చంద్రశేఖరు కాశీవిశ్వేశ్వరుడు నాశ్ర యింతము మనకు స్థిరమైనఫలము లభించును. ఆ దేవతా చక్రవర్తి యనుగ్రహంబున బొందరాని కోర్కెలులేవు నీవింక నిశ్చింతతో నుండుమని పలుకుటయు నప్పంకజగంధి సంతోషంబున నిట్లనియె.

మహాత్మా ! దివ్యప్రబావుండవగు నీకు సాధ్యముగానిపని యెద్దియునులేదు. అ విశ్వేశ్వరు నారాధించి తత్సదృశుండగు కొమరుని నాకు బ్రసాదింపుమని ప్రార్దిం చుటయు ధర్మపత్ని పై గల యనురాగంబున నట్టివానినే నీ యందుఁ బడసెదనని వరంబిచ్చి యంతలోఁ దెలిసికొని అయ్యో ! ప్రమాదము వచ్చినదిగదా ? ఇందు శేఖర సదృశుండగు కొడుకునుబడయు టెట్లు ? అతని కతండే సాటికాదా ! ఇట్టికోర్కె యీమె యెట్లుకోరెను. కోరినంతనే నేనెట్లు సమకూర్తునంటిని ? విధిప్రేరణంబున నాకంబుకంఠి యట్లనెనేమో గదా ! విధి యెట్లున్నదో యట్లు కాఁగలదు. వగవ నేమిటికి ?

అని తలంచుచు నప్పుడే సతీయుతుండై పయనంబై కతిపయదివసంబుల కాయవిముక్త క్షేత్రముఁ జేరెను.

అందు మణికర్ణికాది సకలదివ్య తీర్థంబుల నవగాహనం బొనర్చి భద్రకాళి కాలభైరవు ఢుంటివిఘ్నేశ్వరాది దేవతల నర్చించి ఓంకారేశ్వరాది శతసహస్ర సంఖ్యం గల మహేశ్వర లింగములం బూజించి విశ్వేశ్వర మహాదేవు నారాధించి యభిమతం బులం బడసెదఁగాక యని సంకల్ప పూర్వకముగా నియమంబుదాల్చి యందు వలన మూల ఫలాశనులై యా విశ్వేశ్వరు నారాధించెను. మఱియు వారు --