పుట:కాశీమజిలీకథలు-12.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నిన్నల్లునిగాఁ బడయుటకు దీర్ఘతపం బొనరించుచున్నాఁడు. నీవు పితృగృహంబున కేగుటతోడనే యతం డేతెంచి నీ వివాహమున కంగీకరింపుమని నీ జనకునిఁ బ్రార్దిం చును. కావున నీ వతిశీఘ్రంబున గృహంబునకుఁ బొమ్ము. నీవాబాలికామణిఁ బెండ్లియై రత్నాకర రత్నసరిత్సరః పల్వలంబులకు వాపీకూపతటాకంబులకు పశ్చిమదిక్కునకు నధీశ్వరుండవై జెలంగగలవాడవని యానతిచ్చి యీశ్వరుండు తిరోహితుండయ్యెను. పిమ్మట శుచిష్మంతుఁడు యీశ్వర ప్రబోధితుండై నిజనివాసంబునకేగి యా సలిలా ధ్యక్షు తనయను పరిణయమై వరుణుండయ్యెను. గోపా ! వారణాసియందు కర్దమ పుత్రునిచే బ్రతిష్టింపఁబడిన యీశ్వరలింగంబు సుప్రసిద్ధమైయుండు. ఆ లింగమును సేవించువారికి సంతాప భయంబును నపాయ మరణభయంబులును మొదలగు భయం బులు పుట్టకుండ గాపాడుచుండును. అని చెప్పి మణిసిద్ధుండు వానితోఁగూడ తరువాయి మజిలీ చేరి యందు కాల్యకరణీయంబులఁ దీర్చుకొని కాశీవిశ్వేశ్వరుం గూర్చి చేసిన తపఃఫలప్రభావ ద్యోతకంబగు నొక నితిహాస మిట్లని చెప్పదొడంగెను.

355 వ మజిలీ

విశ్వానరునికథ

తొల్లి శాండిల్యగోత్రంబున విశ్వానరుండను బ్రాహ్మణోత్తముండు కలడు. అతఁడు పిన్ననాటనుండియు విశ్వేశ్వరునియందు భక్తిగలిగి శివభక్తులలో నుత్తముడని ప్రఖ్యాతినొందెను. మఱియు నతండు గురుశుశ్రూషఁనొనర్చి త్రికాలములయందు నగ్నినారాధించుచు వేదాధ్యయనంబు గావించుచుండెను. క్రమంబున వేదముల సాంత ముగా నేర్చి శాస్త్రములయం దసమానమైన పాండిత్యము సంపాదించి వేదార్దావబోధము జక్కగా జేసికొని బహ్మచర్యాశ్రమ ధర్మంబుల నింతేనియుం దప్పక నెరవేర్చుచు నొకనాఁ డొంటరిగాఁ గూర్చుని యిట్లని వితర్కించుకొనెను.

మనుజునకు చతురాశ్రమంబులలో నిహపరసాధకమగు నాశ్రమమెయ్యది ? ఇఁకముందు నే నేయాశ్రమంబునం బ్రవేశింతు ? బ్రహ్మచర్యంబున నధ్యయనాదు లును, గార్హస్థ్యంబున నగ్న్యాధానాదులును, వానప్రస్థంబున నరణ్యవాసాదులును, యత్యాశ్రమంబున శ్రవణాదులును, ధర్మంబులై నొకదానినొకటి మించి యొప్పు చున్నవి కదా ! నాకుఁజూడ గృహస్థాశ్రమంబు నన్ని యాశ్రమంబులకు నాధార భూతమై యిహపర సౌఖ్యదాయకంబై గన్పట్టుచున్నది ఏమన పరదార పరిత్యాగంబున నాత్మదార పరితోషంబున బ్రహ్మచర్య ధర్మంబును. రాగద్వేష కామక్రోధాదుల వర్ణనంబున వానప్రస్థ ధర్మంబును దేవమనుష్య పితృయజ్ఞంబుల, సత్యశౌచాహింసాది నియమంబుల వలనను యత్యాశ్రమ ధర్మంబును గలిగి గృహస్థునియం దభిలాశ్రమ ధర్మంబులు వర్తించుచున్న యవి మఱియు‌ గృహస్థాశ్రమంబున నభ్యాగతుం బూజించి పూర్వము పక్షిజాతియందు పుట్టిన కపోతము లత్యుత్తమగతిం జెందినవని జెప్పుదురు