పుట:కాశీమజిలీకథలు-12.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుచిష్మంతుని కథ

289

పాశబద్దంబగుఁ నమ్మకరంబును నీడ్చుకొనిఁ తండ్రి సన్నిధికింబోయిఁ నమస్కరిం చెను. ఆ మహానుభావున కప్పుడే ప్రణిధానావసానంబగుటయు నేత్రోన్మీలనం బొనర్పి -


సీ. గ్రాహదంష్ట్రాటంకికా శిఖాగ్రముసోఁకి
            కందిన జఘనభాగంబుతోడ
    నుదకబిందుకలాప ముట్టి యుట్టిపడంగఁ
            గరమొప్పు ముద్దుకూఁకట్లతోడ
    నరుణాంచలంబులై యరవిందగర్భ‌ ప
            త్రములఁబోలు విలోచనములతోడ
    బహులయాతాయాత పరిపాటిఁ బాటిల్లు
            గఱువంపు నిట్టూర్పు గాట్పుతోడ

గీ. సంభ్రమంబున నచ్ఛొదసరసి వెడని
    మేటినక్రమంబు సందిట త్రాటఁబట్టి
    వచ్చితనకట్టెదుర నున్న వానిఁబుత్రుఁ
    గాంచె దుర్దమతేజుండు కర్దముండు.

అట్లుగాంచి వానివలన జరిగిన వృత్తాంతమంతయు నెఱింగి యీశ్వరాను గ్రహంబునకు సంతసించి యక్కుమారును లాలించి యే దోషము నెఱుంగని యా మకరంబును విడిచిపుచ్చెను.

శుచిష్మంతుడును గొన్నిదినములు గడచినపిమ్మట తండ్రి యనుమతంబు వడసి జడజీవులయందుఁ పగసాధించువాడై వారణాసికింబోయి యొక్క పవిత్ర ప్రదేశమున లింగప్రతిష్టఁగావించి విశ్వేశ్వరునిఁగూర్చి దద్దయుం బెద్ద తపంబాచరిం చెను. వానితపమునకుమెచ్చి యీశ్వరుండు బ్రత్యక్షంబై కోరినవరంబు లొసంగి మఱియు నిట్లానతిచ్చె.

వత్సా ! సవిలాధ్యక్షుని తనయ ప్రమద్వర నీయందే బుద్ధినిలిపియున్నది. ఆ సుందరి సర్వవిధంబుల నీకు తగిన భార్య. ఆమెను వివాహమాడి‌ సుఖింపుమని యానతిచ్చు పరమేశ్వరునకు శుచిష్మంతు డిట్లనియెను. దేవదేవా! మీ యాజ్ఞ శిరసావ హించుచున్నాను. మాయతనంబున నన్ను నముద్ర మధ్యంబునకు మొసలిచే నీడ్పించిన వాని తనూజాతనుఁ బెండ్లియాడుటకు నామనం బంగీకరింపకున్నదనుటయు నందులకు విశ్వేశ్వరుండు మందస్మితంబున నిట్లనియె. అది వారితప్పుకాదు. మదీయానుమతం బున గంధర్వపతి మకరంబై నిన్ను జలాధిదేవత సన్నిధికిం గొనిపోయెను. ఇందుకై డెందంబున గుందవలసిన పనిలేదు. వత్సా ! సలిధ్యక్షుండు నిన్నెడబాసిన నాటఁగోలె