పుట:కాశీమజిలీకథలు-12.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

లేకుండ నీజలమధ్యంబునఁ బెండ్లి సేయుమని పంపియుండలేదు. సత్వరమ వానినిందుఁ దెప్పించి మా కప్పగించనియెడల ముప్పురాగలదని నమ్ముఁడు. జాగుచేసిన నీశ్వరా గ్రహంబునకు పాత్రులయ్యెదరు. అనిపలుకు వానిమాటల కెదురాడనోడి యా ముని కుమారునిఁ దోడ్కొని సత్వరమ వచ్చునట్లు సరిత్పతి సన్నిధి కిరువురు పరిచారికల నప్పుడే యామె పంపినది.

పిమ్మఁట గొంతసేపటికి సలిలాధ్యుక్షుండు కర్దమముని తనూజునితో నచ్చోటి కతిరయంబునఁ జనుదెంచి జరిగిన కథయెల్ల దెల్లముగ వారివలన నెఱింగి యందుఁ ద్రిశూలహరియైయున్న ప్రమధుని వాని సన్నిధినున్న గంధర్వకుమారునిం గాంచి వినయంబుఁదోప నమస్కరించి యిట్లనియె. దేవోత్తములారా ! ఇందు మా తప్పేమియులేదు. ఇందు మౌళియానతిచ్చెనని యతని నిందుంచితిమి. గాని మఱొం డెద్దియుఁ గాదు. ఈశ్వరాదేశంబున కెదురాడ నెవ్వరోపుదురు ! వీనినిచే‌ గైకొని పితృ సన్నిధికిఁ జేర్చుఁడు నేనుచేసిన యవజ్ఞతకు క్షమింపుఁడు. యీ కుమారుండు నా తనూజ నొల్లకున్నవాఁడు. వీనినే గాని యింకొక పురుషుని వివాహమాడుటకు మా తనయ యొప్పుకొనకున్నది. ఎట్లు పరిణమించునో యీశ్వరునకే తెలియవలయునని పలుకుచు నమ్మునికుమారుని ప్రమధున కప్పగించెను. అతండును నా వరుణాలయము నుండి యవ్వలకేగుట కుపాయంబెఱుంగక నాయుదధినాధున కిట్లనియె.

ఆర్యా ! నీ వినయమునకును యీశ్వరునియందలి భక్తితాత్పర్యంబునకును మేమెంతేని సంతసించితిమి. ఈ శుచిష్మంతుని నల్లునిగాఁ బడయఁ దలంపుగల నీవు వీనినితగినట్లు వీడ్కొలుపకునికి యనుచితముకాదా ! వీని మనంబునకు సంతోషముఁ గలుగఁ జేయుట నీకు తగినపనియని యనుటతోడనే యా జలాధినాయకుండు తన యవి వేకంబునకు పశ్చాత్తాపముఁ జూపుచు నప్పుడే యబ్బాలకుని నూత్నాంబరాభరణ భూషి తునిజేసి విలువగల కానుకలెన్నేని సమర్పించి ప్రమధుని గంధర్వకుమారుని నర్హ రీతి సత్కరించి గొండొక మకరంబుఁ బిలిపించి దానిపై వారి మువ్వురఁ గాసారతీరంబు నకు సురక్షితంబుగాఁ జేర్పించెను.

354 వ మజిలీ

శుచిష్మంతునికథ

తీరముఁజేరినతోడనే ప్రమధుండు గంధర్వకుమారుని వాని లోకంబునకు, బంపివేసి యా మునికుమారునితో నీవిఁక యింటికింబోయి మీ జనకుని సందర్శింపు మని బోధించి విశ్వనాధుని యాదేశంబున నింతదనుక మసలవలసివచ్చెనని పలుకుచు నిజ నివాసంబుసకుం బోయెను.

శుచిష్మంతుడును జరిగిన వృత్తాంతమునకెల్ల మిగుల నబ్బురం బడుచుఁ దనకు దుష్టగ్రాహంబు మూలంబునగదా యిట్టిపాటు సంభవించెనను క్రోధంబున